అశ్వారావుపేటరూరల్: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి, బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతాలకు చెందిన రైతుల బృందం గురువారం అశ్వారావుపేటలోని హెచ్‌ఆర్‌ఎస్(ఉద్యాన పరిశోధనా స్థానం)ను సందర్శించారు. ఆయా జిల్లాలకు చెందిన రైతాంగం కొత్తగా ఆయిల్‌పాం పంటను సాగు చేసే నేపథ్యాన పంట సాగు విధానాలు, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై స్వయంగా తెలుసుకునేందుకు రాగా స్థానిక హెచ్‌ఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ వారికి అవగాహన కల్పించారు. అదే విధంగా పంట సాగు నుంచి దిగుబడి వరకు పాటించాల్సిన జాగ్రత్తలు, నాణ్యమైన మొక్కల ఎంపిక, ఎరువుల వినియోగంపై వివరించారు. కొత్తగా సాగు చేసే రైతులు తప్పనిసరిగా నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ సదుపాయాలపై సమగ్రంగా తెలుసుకోవాలని సూచించారు. పంట సాగు చేసిన తొలి నాలుగేళ్లలో సాగు చేయాల్సిన అంతర పంటల వివరాలు, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ఉద్యాన అధికారిణి కె.దీపిక, కొల్లూరు ఉద్యాన అధికారి కల్యాణ్ చక్రవర్తి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


