ఖమ్మం.. ఉద్యమ గుమ్మమై | - | Sakshi
Sakshi News home page

ఖమ్మం.. ఉద్యమ గుమ్మమై

Jun 2 2026 12:38 AM | Updated on Jun 2 2026 12:38 AM

ఆరోగ్యం క్షీణించడంతో

ఇక్కడి ఆస్పత్రిలో చికిత్స

అండగా నిలిచిన సంఘాలు, పార్టీల నాయకులు, ప్రజలు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉమ్మడి ఖమ్మం జిల్లా.. మలిదశ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించింది. తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో 2009 నవంబర్‌ 29న నాటి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఆ సమయంలో ఉద్యమం ప్రత్యేక దిశను సంతరించుకుంది. అక్కడ కేసీఆర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి ఖమ్మం సబ్‌జైలుకు తరలించడంతో జిల్లా అంతటా నిరసనలు, ప్రదర్శనలు హోరెత్తాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా న్యూడెమోక్రసీ, సీపీఐ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం, అన్ని వర్గాల ప్రజలు కలిసిరావడంతో ఉద్యమం ఉధృతరూపం దాల్చింది.

ఖమ్మం సబ్‌జైలుకు..

తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్‌ ఆమరణదీక్ష చేయాలని నిర్ణయించి.. 2009 నవంబర్‌ 29న కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌ నుంచి సిద్దిపేట సమీపంలోని రంగథంపల్లి దీక్షా స్థలికి బయలుదేరారు. దీంతో కేసీఆర్‌ను అల్గనూర్‌ క్రాస్‌ వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. రోజంతా తీవ్ర ఉత్కంఠ మధ్య పలు మార్గాల్లో తిప్పుతూ, వాహనాలు మారుస్తూ రాత్రి ఖమ్మం చేర్చారు. అదే రోజు రాత్రి ఖమ్మం సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట కేసీఆర్‌ను హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో రాత్రి ఒంటి గంట ప్రాంతంలో దానవాయిగూడెంలోని ఖమ్మం సబ్‌ జైలుకు తరలించారు.

ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి..

జైలుకు తరలించాక కూడా కేసీఆర్‌ ఆమరణ దీక్ష కొనసాగించారు. ఈ కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేశారు. ఆపై ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో భద్రతా కారణాల దృష్ట్యా, మెరుగైన వైద్యం కోసం కేసీఆర్‌ను డిసెంబర్‌ 3న హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డిసెంబర్‌ 9వరకు ఆయన దీక్ష చేశారు.

ఉద్యమ కెరటంగా ఖమ్మం

కేసీఆర్‌ను ఖమ్మం సబ్‌ జైలుకు తరలించడంతో ఖమ్మం ఉద్యమ గుమ్మంలా మారింది. కేసీఆర్‌కు మద్దతుగా సీపీఐ, అప్పటి న్యూడెమోక్రసీ, ప్రస్తుత సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ నాయకులు, విద్యార్థి, యువజన సంఘాలు, కుల సంఘాలు, ప్రజాసంఘాల నాయకులే కాక మేధావులు, ఉద్యోగులు, న్యాయవాదులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. రోడ్డుపైకి వచ్చి ఆటపాటలతో తమ నిరసన తెలుపుతూ కదం తొక్కారు.

నాడు ఖమ్మం సబ్‌జైలులో కేసీఆర్‌ ఆమరణ దీక్ష

Advertisement
 
Advertisement
Advertisement