ఇటీవల ఏసీబీకి చిక్కిన భద్రాచలం డివిజన్ అధికారులు దుమ్ముగూడెం కార్యాలయం నుంచి టేకు దిమ్మెలు మాయం ఉన్నతాధికారులు విచారణ జరపాలని కోరుతున్న స్థానికులు
భద్రాచలంటౌన్: భద్రాచలం డివిజన్‌లో అటవీశాఖ వివాదాలు, అవినీతి ఆరోపణలు, అంతర్గత విభేదాలకు చిరునామాగా మారింది. సమన్వయ లోపంతోపాటు గ్రూపులుగా విడిపోయి ఉన్నతాధికారులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇటీవల చర్ల మండలం ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో రహదారి నిర్మాణానికి సంబంధించి చెట్లు తొలగించిన ఘటనలో ఓ కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భారీగా లంచం డిమాండ్ చేసి భద్రాచలం ఎఫ్‌డీఓ సుజాత, చర్ల ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ కృష్ణయ్య ఏసీబీకి చిక్కారు. ఈ ఉదంతం జరిగాక కూడా వసూళ్ల పర్వం ఆగలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమంగా తరలిస్తున్న టేకు దిమ్మెలను స్వాధీనం చేసుకుని దుమ్ముగూడెం రేంజ్ కార్యాలయంలో ఉంచగా, అవి మాయం కావడం కలకలం రేపింది. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండేందుకు, పెద్ద సైజు దిమ్మెల స్థానంలో చిన్న సైజు దిమ్మెలను తీసుకొచ్చి క్లియరెన్స్ ఇచ్చేందుకు కొందరు సిబ్బంది ప్లాన్ చేసినట్లు సమాచారం. భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద ఉన్న చెక్‌పోస్టు వసూళ్లకు అడ్డాగా మారిందని, రేంజ్ స్థాయి అధికారుల ఒత్తిడి, అండదండలతోనే నెలవారీ వసూళ్ల పర్వం సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో వాటాలు పైస్థాయి అధికారుల వరకు అందుతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే డివిజన్‌లో అటవీశాఖ అస్తవ్యస్తంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమంగా కలప తరలిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని, అక్రమ కలప రవాణాపై నిఘా పెంచాలని కోరుతున్నారు.
అటవీ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. భద్రాచలం డివిజన్‌లో జరుగుతున్న ప్రతీ అంశం మా దృష్టిలో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.
– కృష్ణాగౌడ్, డీఎఫ్‌ఓ


