స్ఫూర్తి నింపే బక్రీద్‌..! | - | Sakshi
Sakshi News home page

స్ఫూర్తి నింపే బక్రీద్‌..!

May 28 2026 12:22 AM | Updated on May 28 2026 12:22 AM

● జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదులు సిద్ధం ● భక్తి, త్యాగం, దానధర్మాల సందేశం

సమానత్వాన్ని చాటే సందేశం..

● జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదులు సిద్ధం ● భక్తి, త్యాగం, దానధర్మాల సందేశం

కరకగూడెం: త్యాగానికి, భక్తికి, దానధర్మాలకు గుర్తు అయిన బక్రీద్‌ (ఈద్‌–ఉల్‌–అజ్హా) పర్వదినం ఎంతో స్ఫూర్తిదాయకమని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం 12వ నెల అయిన జుల్‌ హజ్‌ మాసంలో పదో రోజున వచ్చే ఈ పండుగను జిల్లావ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అల్లాహ్‌పై ప్రవక్త ఇబ్రహీం చూపిన అచంచలమైన విశ్వాసానికి, అంకితభావానికి ప్రతీక అయిన పండుగను గురువారం జరుపుకోనున్నా రు. కాగా, ప్రత్యేక ప్రార్థనల కోసం దాదాపు జిల్లావ్యాప్తంగా 160 మసీదులు, పలు ఈద్గాలు సిద్ధమయ్యాయి. కాగా, ఇస్లాం ఐదు సూత్రాల్లో (స్తంభాల్లో) ముఖ్యమైన హజ్‌ యాత్రకు బక్రీద్‌తో విడదీయరాని బంధం ఉంది. ప్రతి ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా మక్కా నగరంలోని కాబా ఆలయాన్ని దర్శించుకుని, ప్రదక్షిణ (తవాఫ్‌), సఫా (మర్వా కొండల మధ్య నడక) అరాఫాత్‌ మైదానంలో ప్రార్థనలు చేయాలనుకుంటారు. ప్రవక్త ఇబ్రహీం, అతని భార్య హాజర్‌, కుమారుడు ఇస్మాయిల్‌ జీవితంలోని ఘటనలను ఇవి గుర్తుచేస్తాయని పెద్దలు చెబుతారు. ఈ యాత్రను పూర్తి చేసిన వారు పాపాల నుంచి విముక్తి పొందుతారని విశ్వాసం.

అల్లాహ్‌పై ప్రవక్త ఇబ్రహీం (అలైహివస్సలాం) చూపిన అంకితభావానికి, త్యాగానికి ప్రతీక ఈ ఈద్‌–ఉల్‌–అజ్హా (బక్రీద్‌). దేవుని ఆజ్ఞ కోసం తన కుమారుడినే త్యాగం చేసేందుకు సిద్ధపడిన రోజు ఇది. ఈ పండుగలో ఇచ్చే ‘కుర్బానీ’వెనుక ఒక గొప్ప సామాజిక సందేశం ఉంది. పండుగ రోజు అందరి ఇళ్లల్లో కాంతి నిండాలనే ఉద్దేశంతోనే ఇస్లాం దానధర్మాలను ప్రోత్సహిస్తోంది. సమాజంలో ఉన్న పేదరికం, అసమానతలను తొలగించి అందరినీ సమానంగా ఆదరించడమే నిజమైన బక్రీద్‌.

–మౌలానా ఆజం, జామ మస్జీద్‌ పద్మాపురం

Advertisement
 
Advertisement
Advertisement