కాలుష్య కోరల్లో పినపాక | - | Sakshi
Sakshi News home page

కాలుష్య కోరల్లో పినపాక

May 17 2026 12:12 AM | Updated on May 17 2026 12:12 AM

కలుషితమవుతున్న నది..

మూగజీవాల ఆర్తనాదం

తూతూమంత్రంగా

పొల్యూషన్‌ బోర్డు తనిఖీలు..

నివేదిక విడుదలలో

జాప్యంపై ప్రజల అసంతృప్తి

పినపాక: ఒకప్పుడు స్వచ్ఛమైన గాలికి, పరవళ్లు తొక్కే గోదావరికి నెలవైన పినపాక నేడు కాలుష్య కాటుకు విలవిలలాడుతోంది. అటు బీటీపీఎస్‌ నుంచి ఎగసిపడుతున్న బూడిద.. ఇటు నిరంతర బొగ్గు రవాణా వల్ల దట్టంగా అలుముకుంటున్న ధూళి.. వెరసి పినపాక ప్రజలు ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఈ–బయ్యారం, సీతారాంపురం, దమ్మక్కపేట వంటి గ్రామాల ప్రజలు అనుభవిస్తున్న నరకయాతన వర్ణనాతీతం. పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలవడంతో నీటి నాణ్యత దెబ్బతిని, గోదావరి ఆధారంగా జీవనం సాగించే ప్రజలు, మూగజీవాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కాలుష్యం కేవలం పర్యావరణానికే పరిమితం కాకుండా ప్రజల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతూ ఆందోళన కలిగిస్తోంది.

పొలాలపై బూడిద..

ప్రజలకు శ్వాసకోశ బాధలు

అటు ఇళ్లపై, ఇటు పంట పొలాలపై దట్టంగా బూడిద కమ్ముకుంటుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంటల దిగుబడి తగ్గిపోవడమే కాకుండా, పశువుల మేత కూడా విషతుల్యంగా మారుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నిత్యం బొగ్గు రవాణా చేసే భారీ వాహనాల వల్ల రోడ్లపై ఎగసిపడుతున్న ధూళి కారణంగా స్థానిక గ్రామాల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై

బాధితుల ఆగ్రహం..

ఇటీవల పర్యావరణ కాలుష్యంపై వెల్లువెత్తిన ఫిర్యాదులతో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు ఈ–బయ్యారం, సీతారాంపురం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీలు కేవలం కంటితుడుపు చర్యగానే సాగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రంగా ఉన్నా, అధికారులు తనిఖీలు ముగిసి రోజులు గడుస్తున్నా నివేదికను బయటపెట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్య కారక సంస్థలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారా? అని బాధిత ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

ఉన్నతాధికారుల జోక్యం కావాలి..

కేవలం కంటితుడుపు చర్యగా తనిఖీలు చేసి వెళ్లడం కాకుండా, ఉన్నతాధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాలుష్య నియంత్రణకు అవసరమైన శాశ్వత చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యం కన్నా పరిశ్రమల లాభాలే ముఖ్యమా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా మొద్దు నిద్ర వీడాలని, లేనిపక్షంలోబాధిత ప్రజలందరం కలిసి పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. కాలుష్య రక్కసి నుంచి తమ గ్రామాలను కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికై నా సిద్ధమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

గోదావరిని మింగేస్తున్న బొగ్గు, బూడిద

Advertisement
 
Advertisement
Advertisement