మణుగూరుటౌన్: మొక్కజొన్న అధిక దిగుబడి వస్తుందని పలువురు తమను నమ్మించి మోసం చేశారని మండలంలోని తిర్లాపురం రైతులు పేర్కొన్నారు. బుధవారం వారు వివరాలు వెల్లడించారు. మొక్కజొన్న పైనిర్ వైసీ 904 కంపెనీ విత్తనాలతో మంచి దిగుబడి వస్తుందని చెప్పగా 40 ఎకరాల్లో సాగు చేస్తే ఆశించిన ఫలితం లేక 12 మంది రైతులు నష్టపోయినట్లు వెల్లడించారు. చర్ల గ్రామానికి చెందిన కొందరు, మణుగూరుకు చెందిన మరికొందరితో కలిసి ఈ విత్తనాలు అంటగట్టారని తెలిపారు. అయితే, కోత సమయాన కొందరి వద్దే పంటను కొనుగోలు చేసి మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నందున అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.
పోగొట్టుకున్న మొబైల్స్ అప్పగింత
టేకులపల్లి: పోగొట్టుకున్న మొబైళ్లను సీఈఐఆర్ పోర్టల్ సాయంతో పట్టుకున్న పోలీసులు బుధవారం బాధితులకు అందజేశారు. మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన బి.లింగయ్య, కోక్యతండాకు చెందిన రమేశ్ కొన్ని నెలల క్రితం తమ మొబైళ్లను పోగొట్టుకున్నారు. బాధితులు సీఈఐఆర్ పోర్టల్‌తోపాటు టేకులపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రాజేందర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫోన్లను రికవరీ చేసి, పోలీస్ స్టేషన్‌లో బాధితులకు అప్పగించారు.
71 కేజీల గంజాయి స్వాధీనం
నలుగురు నిందితుల అరెస్ట్
సూపర్‌బజార్(కొత్తగూడెం): గంజాయి తరలిస్తున్న నలుగురిని కొత్తగూడెం వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వన్‌టౌన్ సీఐ కరుణాకర్ కథనం ప్రకారం.. వన్‌టౌన్ ఎస్‌ఐ రాకేశ్ ఆధ్వర్యాన సిబ్బంది మంగళవారం సాయంత్రం పాత కొత్తగూడెం సెంటర్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నలుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వాహనాన్ని తనిఖీ చేయగా 71.795 కేజీల గంజాయి లభ్యమైంది. నిందితులు మహ్మద్ అజాజ్, కొలి అరుణ్, రంగాల రాజారామ్, గోగుల సతీశ్ రూ.35,98,750 విలువైన గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు తేలింది. నలుగురిని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కరుణాకర్ వివరించారు.


