పంచాయతీ కార్యాలయంలో రికార్డుల చోరీ | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యాలయంలో రికార్డుల చోరీ

May 7 2026 7:56 AM | Updated on May 7 2026 7:56 AM

దమ్మపేట: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం రాత్రి రికార్డులు చోరీ జరిగిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న అనంత్‌కుమార్‌ బుధవారం ఉదయం 9.30 గంటలకు కార్యాలయానికి వెళ్లగా, తన గదికి వేసిన తాళం పగులగొట్టి ఉంది. లోపల ఉన్న మూడు ఇనుప బీరువాలు తెరిచి, నాలుగేళ్ల స్టాఫ్‌ అటెండెన్స్‌ రిజిస్టర్‌, క్యాష్‌ బుక్స్‌, హౌజ్‌ ట్యాక్స్‌ బుక్స్‌, ఎంబీ బుక్‌, గ్రామసభ తీర్మానాల రిజిస్టర్లు చోరీకి గురైనట్లు గుర్తించాడు. కార్యదర్శి ఫిర్యాదుతో కార్యాలయంలో క్లూస్‌ టీం వేలిముద్రలు, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.

ఇంటి దొంగల పనేనా..?

కార్యాలయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై పలువురు వార్డు సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దమ్మపేట గ్రామ పంచాయతీలో నకిలీ ఇంటి పన్ను రశీదులతో పాటు పంచాయతీకి సంబంధంలేని ఇద్దరు వ్యక్తులకు వేతనాల చెల్లించడం లాంటి అవకతవకలపై డాక్యుమెంట్‌ రూపంలో వివరణ కావాలని రెండు వారాలుగా వార్డు సభ్యులు కోరుతున్నప్పటికీ కార్యదర్శి ఇవ్వలేదు. ఈ అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించిన సమయంలోనే రికార్డులు చోరీ కావడం, ఈ చోరీ ఇంటి దొంగల పనేనని గ్రామస్తులు, వార్డు సభ్యులు అనుమానిస్తున్నారు. ఈ చోరీపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, నిందితులను కనిపెట్టాలనే డిమాండ్‌ చేస్తున్నారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

అశ్వాపురం: మండల కేంద్రంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మండల కేంద్రంలోని ఎస్సీకాలనికి చెందిన రిక్షా కార్మికుడు మురికిపుడి పెంటయ్య (58) ఏప్రిల్‌ 24న రిక్షాతో రోడ్డు దాటుతుండగా ఎదురుగా వచ్చిన బైక్‌ ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనకు ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement