ఖమ్మంగాంధీచౌక్: వేసవి సెలవులు వృథా కాకుండా పిల్లలకు ఏదో అంశంలో తర్ఫీదు ఇప్పించాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ నేపథ్యాన విద్యార్థులకు భవిష్యత్‌లో ఉపయోగపడే ఇంగ్లిష్ నేర్పించేలా మాజీ సైనికుడు ముందుకొచ్చారు. ఇంగ్లిష్ ప్రాధాన్యత, పిల్లల సెలవుల దృష్ట్యా నేవీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన సత్యమూర్తి అరుణ్ ఖమ్మం మమత ఆస్పత్రి రోడ్డులో నామమాత్రపు ఫీజుతో ‘అరుణ్ ఇంటర్నేషనల్ స్పోకెన్ ఇంగ్లిష్’ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు హాజరయ్యే అవకాశం ఉండగా ఉదయం 8–10, 10–12, సాయంత్రం 5–8 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంగ్లిష్ చదివే విధానం, మాట్లాడే విధానం, అక్షరాలను పలకడం, సంభాషణ తదితర అంశాలపై అరుణ్ శిక్షణ ఇస్తున్నారు. అంతేకాక కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేలా శిక్షణ ఇస్తుండడంతో పాఠశాల విద్యార్థులు మొదలు కాలేజీ విద్యార్థులే కాక కొందరు ఉద్యోగులు కూడా వస్తున్నారు.
హ్యాండ్ రైటింగ్ ప్రత్యేకం
పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంలో సమాధానాలు రాయడమే కాక చేతిరాతకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యాన సత్యమూర్తి తన కేంద్రంలో చేతి రాత శిక్షణ కూడా ఇస్తున్నారు. అక్షరాలను ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ పూర్తి చేయాలనే తదితర అంశాలపై శిక్షణ ఇస్తుండడంతో పిల్లలు ఆసక్తిగా హాజరవుతున్నారు.
పిల్లల కోసం మాజీ సైనికుడి అక్షర సేద్యం


