తగ్గిపోతున్న కార్మికుల వివరాలు..
నూతన గనులు లేక...
టార్గెట్ పెంపు సరికాదు
రుద్రంపూర్: సింగరేణి సంస్థలో క్రమంగా కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో గనులు, కాలనీలు వెలవెలబోతున్నాయి. యాజమాన్యం యాంత్రీకరణ పేరుతో భూగర్భ గనులను మూసివేసి ఓపెన్‌కాస్ట్ గనులు ఏర్పాటు చేస్తుండటంతో కార్మికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వీఆర్‌ఎస్, గోల్డెన్ హ్యాండ్‌షేక్ వంటి స్కీమ్‌లతో గత 14 ఏళ్లలో దాదాపు 28 వేల మంది కార్మికులు ఇంటిబాట పట్టినట్లు కంపెనీ గణాంకాలే చెబుతున్నాయి. 2013–14 సంవత్సరంలో 61,778 మంది కార్మికులు ఉండగా, ప్రస్తుతం 39,460 మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. సంస్థలో కార్మికుల సంఖ్య తగ్గుతున్నా యాజమాన్యం మాత్రం ఏటా ఉత్పత్తి రేషియోను 10 శాతం పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే కార్మికుల సంఖ్య తగ్గుతుంటే, ఉత్పత్తి లక్ష్యం పెంచడం వల్లే కార్మికులపై పనిభారం పెరుగుతోందని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు.
నోటిఫికేషన్లేవి?
సింగరేణి సంస్థ మూడేళ్లుగా ఎక్స్‌టర్నల్ నోటిఫికేషన్లు విడుదల చేయడంలేదు. 2023 సంవత్సరంలో 10 విభాగాల్లో 272 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత నియామకాలు చేపట్టలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసిన సీఎండీ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత సంస్థకు ఇద్దరు సీఎండీలు మారారు. కానీ ఎవరూ నోటిఫికేషన్లు, నియామకాలపై దృష్టిసారించలేదు. 2023 ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ఏటా ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక నియామకాల విషయం విస్మరించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏడాది కార్మికుల ఉత్పత్తి (మిలియన్
సంఖ్య టన్నులు)
2013-14 61,778 50.47
2017-18 54,043 62.01
2021-22 43,672 65.02
2025-26 39,460 68.00
సింగరేణిలో పెరుగుతున్న పనిభారం
సింగరేణి సంస్థ ఉన్న గనుల్లో లక్ష్యాలను పెంచుకోవటం వల్ల బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పడుతున్నాయి. అదేరీతిలో కొత్త గనుల ఏర్పాటుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. అప్పుడు కార్మికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.
–కాపు కృష్ణ, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి
సంస్థలో గత 14 ఏళ్లలో కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. యాజమాన్యం మాత్రం ఉత్పత్తి లక్ష్యం పెంచుతూ కార్మికులపై పనిభారం మోపుతోంది. దీనివల్ల కార్మికులు గనుల్లో ఎక్కువ కాలం పనిచేయలేక పోతున్నారు.
–రియాజ్ అహ్మద్, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి


