ఎన్పీడీసీఎల్‌ కంపెనీ కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఎన్పీడీసీఎల్‌ కంపెనీ కార్యవర్గం ఎన్నిక

Apr 6 2026 7:36 AM | Updated on Apr 6 2026 7:36 AM

పాల్వంచ: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (హెచ్‌–142) అనుబంధ ఎన్పీడీసీఎల్‌ కంపెనీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. పాల్వంచలోని కేటీపీఎస్‌ ‘ఏ’ కాలనీలో ఉన్న తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (హెచ్‌–142) కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కేవీ.రామారావు ఆధ్వర్యాన జరిగిన సమావేశానికి కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.దేవ్‌సింగ్‌, ఉపాధ్యక్షులుగా బి.స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎ.నాగరాజు, సహాయ కార్యదర్శిగా వి.మోతీలాల్‌, ప్రచార కార్యదర్శిగా ఆర్‌.యాకయ్య, కోశాధికారిగా సీహెచ్‌.కృష్ణయ్యతో పాటు కార్యవర్గ సభ్యులుగా కె.బాలరాజు, జి.వేణు, ఎం.రాజు, ఎల్‌.బలరాంను ఎన్నుకున్నారు. అలాగే, వివిధ జిల్లాలకు చెందిన నాయకులు యూనియన్‌లో చేరగా వారిని ఆహ్వానించాక రామారావు మాట్లాడారు. కార్మికులు కష్టించి పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి చేయూతనివ్వాలని సూచించారు. అలాగే, నూతన కార్యవర్గం కార్మిక సంక్షేమం కోసం కృషి చేయాలని తెలిపారు. నాయకులు ఎస్‌.శ్రీనివాసాచారి, డి.సత్యరాజ్‌ స్టీవెన్‌, వెంపటి వెంకటేశ్వర్లు, షేక్‌.సయ్యద్‌, వి.కోటేశ్వరరావు, యాకయ్య, భిక్షపతి, గణేశ్‌, అమర్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యా కమిషన్‌ సిఫారసులపై చర్చ జరగాలి

మధిర: రాష్ట్ర విద్యా కమిషన్‌ ఇటీవల సమర్పించిన నివేదికలోని సిఫారసులపై సమగ్ర చర్చ జరపాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్‌ చేశారు. అంతేకాక ప్రభుత్వ విద్యారంగానికి నష్టం కలిగించేవి, ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే అంశాలను తొలగించి విద్యాభివృద్ధికి దోహదపడే అంశాలనే అమలు చేయాలని సూచించారు. మధిరలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ నాగూర్‌ వలీ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యారంగ నిపుణులతో చర్చించకుండా, కనీసం అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా ఏకపక్షంగా సిఫారసులు అమలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. అలాగే, ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుచేయడమే కాక పెండింగ్‌ బిల్లులు, డీఏలు విడుల చేయాలని కోరారు. అంతేకాక సర్వీసు నిబంధనలు, పదోన్నతులు, టెట్‌ మినహాయింపు, సీపీఎస్‌ రద్దు, 2003 డీఎస్సీ టీచర్లు, కేజీబీవీ, సమగ్ర శిక్షా అభియాన్‌, మోడల్‌ స్కూళ్లు, గురుకులాల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నట్టు రవి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు అనుమోలు కోటేశ్వరరావు, రామకృష్ణ, నాగరాజు, వీరయ్య పాల్గొన్నారు.

రైతులకు పరిహారం

అందించాలి

మధిర: మధిరలోని సాయిబాలాజీ కోల్డ్‌ స్టోరేజీ ఇటీవల అగ్నిప్రమాదంలో కాలిపోగా, మిర్చి నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కోరారు. మధిరలో ఆదివారం జరిగిన కోల్డ్‌ స్టోరేజీ బాధిత రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో రూ.కోట్ల విలువైన మిర్చి నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్సూరెన్స్‌ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, బాధితులు పక్షాన పోరాడేందుకు కమిటీని ఏర్పాటుచేసి కన్వీనర్‌గా దొండపాటి నాగేశ్వరరావు, కోకన్వీనర్‌గా గువ్వల సీతారామిరెడ్డిని నియమించారు. ఈ సమావేశంలో సీపీఎం డివిజన్‌ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, నాయకులు శీలం నరసింహారావు, మందా సైదులు, మందడపు ఉపేందర్‌, రైతులు పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై దాడి

పాల్వంచ: పట్టణ పరిధిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. బంగారుజాల, పేటచెరువు శివారులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు కొత్తగూడెం సీసీఎస్‌ పోలీస్‌, పట్టణ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఆరుగురు వ్యక్తులును అదుపులోకి తీసుకుని, మూడు బైక్‌లు, కారు, నాలుగు సెల్‌ఫోన్‌లు, రూ.13 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement