రెవెన్యూ పరిధితో పాటు అటవీ భూమిలోనూ తవ్వకాలు
ఆదివాసీల అభ్యంతరంతో
నిలిచిపోయిన పనులు
కారేపల్లి: అదొక గుట్ట.. అది రెవెన్యూ శాఖ పరిధిలో ఉండడంతో ప్రభుత్వం గోదాం నిర్మాణానికి నిర్ణయించి కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టింది. దీన్ని అలుసుగా తీసుకున్న సదరు కాంట్రాక్టర్ పరిమితికి మించి గుట్టను జేసీబీలతో తవ్విస్తూ మట్టి, రాళ్లను కిందకు తరలించి అమ్మకోవ డం మొదలు పెట్టాడని తెలిసింది. ఇందుకోసం గుట్ట పైనుంచి కిందకు ఏకంగా రోడ్డు మాదిరి చదును చేయించడం గమనార్హం. దీన్ని పక్క న పెడితే హద్దులుదాటి అటవీ భూమిలోనూ తవ్వకాలు మొదలుపెట్టడంతో అటు స్థానికులు, ఇటు అటవీ అధికారులు పనులను అడ్డుకున్నారు. ఫలితంగా గోదాం నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే, ఇదంతా జరిగేలోగా సదరు కాంట్రాక్టర్ రూ.లక్షల్లో ఆర్జించినట్లు విమర్శలు వస్తున్నాయి.
అది కూడా మనదే !
మండలంలోని చీమలపాడులో 33 ఎకరాల మేర అటవీ భూమిని సీతారామ ప్రాజెక్టు కాల్వ నిర్మాణంలో సేకరించారు. ఇందుకు బదులుగా రెవెన్యూ గుట్ట అయిన గంగదేవి గుట్టపై 33 ఎకరాలను అటవీశాఖకు కేటాయించారు. కాగా, రెవెన్యూ పరిధిలోనే గోదాం నిర్మాణ పనులు చేపట్టాల్సిన కాంట్రాక్టర్ అక్కడ మట్టి తవ్వి తరలిస్తూనే కొద్దికొద్దిగా అటవీ శాఖకు కేటాయించిన భూమి నుంచి కూడా తవ్వకాలు మొలుపెట్టాడు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 25న గుర్తించిన కారేపల్లి అటవీ అధికారులు టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి ఒకరు కలగజేసుకోవడంతో అప్పటి వరకు అటవీ అధికారులు – కాంట్రాక్టర్ నడుమ వివాదం సద్దుమణిగింది.
మేం ఊరుకునేదే లేదు..
తవ్వకాల విషయంలో అటవీ అధికారులు కాస్త మెత్తబడినా.. స్థానికులు మాత్రం ససేమిరా అన్నారు. నూరు శాతం ఆదివాసీ గ్రామమైన గుట్టకింది గుంపు గ్రామంలోని గంగదేవి గుట్టను గోదాం నిర్మాణం పేరుతో ధ్వంసం చేస్తున్నారని, మట్టి తరలిస్తూ కాంట్రాక్టర్ రూ.లక్షల్లో ఆర్జిస్తున్నాడంటూ తుడుందెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులే కాక గుట్టకిందిగుంపు సర్పంచ్ ఉండం రాఘవులు, గ్రామస్తులు పనులు అడ్డుకుని మార్చి 25న ఆందోళన చేపట్టారు. జీపీ తీర్మానం లేకుండా పనులు చేపట్టడమే తప్పు కాగా, ఇక మట్టి తవ్వకాలను సహించేది లేదని హెచ్చరించారు. స్థానికులు, నాయకుల తిరుగుబాటును గమనించిన కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడు. అప్పటికి కానీ స్పందించని ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించారు. ఈమేరకు రెండు రోజుల క్రితం గిడ్డంగుల సంస్థ ఎస్‌ఈ ఆర్.శ్రీనివాసరావు గ్రామానికి వచ్చారు. పనుల ప్రదేశాన్ని పరిశీ లించడమే కాక సర్పంచ్, గ్రామస్తులతో మాట్లాడి అభ్యంతరాలపై ఆరా తీశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన నేపథ్యా న.. ఆ తర్వాత ఏం జరగనుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.
ఎక్కడ.. ఏమిటీ కథ?
కారేపల్లి మండలం గుట్టకిందిగుంపు గ్రామ సమీపా న గంగదేవి గుట్ట ఉంటుంది. ఈ గుట్టపై గోదాం నిర్మించేందుకు ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించడమే కాక రూ.9కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈమేరకు కాంట్రాక్టర్‌కు అప్పగించగా మూడునెలల క్రితం పనులు మొదలయ్యాయి. మొదట్లో అంతా సవ్యంగానే సాగినా సదరు కాంట్రాక్టర్ గుట్టపై చెట్లు నరికివేయడమే కాక మట్టిని జేసీబీలతో కొల్లగొట్టి టిప్పర్లతో తరలించడం ప్రారంభించాడు. ఇందుకోసం గుట్టను తొలిచి ఇల్లెందు–కారేపల్లి ప్రధాన రహదారి వరకు సుమారు 500 మీటర్ల రోడ్డు వేసేశాడు. దీంతో స్థానికులు పరిశీలించడంతో జేసీబీలతో తొలుస్తూ పదుల సంఖ్యలో టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నట్లు తేలగా పనులు చేపట్టేందుకు వీల్లేదని పట్టుబట్టారు.
ఇష్టారాజ్యంగా మట్టి, రాళ్ల తవ్వకం, తరలింపు


