● తల్లిని బైక్‌పై తీసుకెళ్తుండగా ఘటన ● వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో కొడుకు మృతి, తల్లికి గాయాలు
పాల్వంచ: రోడ్డు ప్రమాదంలో తల్లి ముందే కొడుకు తీవ్రగాయాలై మృతి చెందడం తీవ్రంగా కలిచివేసింది. తల్లిని మోటార్ సైకిల్‌పై తీసుకెళ్తుండగా, కారు రూపంలో మృతువు దూసుకొచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచలో బాబుజగ్జీవన్‌రామ్ జయంతిలో పాల్గొనేందుకు కరకవాగుకు చెందిన 34వ డివిజన్ కార్పొరేటర్ భట్టు విజయలక్ష్మి శనివారం తన కుమారుడు అఖిల్ నందన్(19) బైక్‌పై బయలుదేరారు. బస్టాండ్ వద్ద కొత్తగూడెం నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టి.. కింద పడిన అఖిల్‌నందన్ పైనుంచి వెళ్లడంతో తల భాగం నుజ్జునుజ్జయింది. విజయలక్ష్మికి కూడా గాయాలయ్యాయి. వీరి వెనకాలే మరో బైక్‌పై వస్తున్న పెద్ద కుమారుడు చైతన్‌శ్రీ స్థానికుల సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అఖిల్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు
తల్లిని తీసుకెళ్తున్న కుమారుడు రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో మృతి చెందడం అందరినీ కలిచివేసింది. అఖిల్ తల్లిదండ్రులు భట్టు లక్ష్మణ్, విజయలక్ష్మిని పరామర్శించేందుకు బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకోగా రోదనలు మిన్నంటాయి. అలాగే, మేయర్ మూడ్ గణేశ్, డిప్యూటీ మేయర్ లలితకుమారి, కార్పొరేటర్లు, నాయకులు కూడా మృతదేహం వద్ద నివాళులర్పించారు. కాగా, ఇంటర్ పూర్తిచేసిన అఖిల్‌నందన్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యాన ప్రమాదం జరగడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై ఆయన తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.


