తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ద్రావణాలు ఎక్కువగా తీసుకోవాలి
జాగ్రత్తలు అవసరం..
● ఠారెత్తిస్తున్న ఎండలు ● ఆస్పత్రుల్లో పెరుగుతున్న ఓపీలు ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
పాల్వంచరూరల్: భానుడి భగభగలతో పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఉద యం 9 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ వారం వరకు సరైన రక్షణ చర్యలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించడంతో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆస్పత్రులపాలు కాకతప్పదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే రాత్రి వేళల్లో చల్లటి గాలుల మూలంగా వాతావరణంలో మార్పులు చేసుకుని ప్రధానంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో ఓపీల సంఖ్య ఎక్కువవుతోంది.
ఆరోగ్యంపై ప్రభావం..
ఎండాకాలంలో చిన్నపిల్లలు, వయసు పైబడిన వారు ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునే శక్తి ఉండకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతుండగా.. గంటకోసారి నీళ్లు లేదా ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వంటి పౌష్టికాహారంతో రోగనిరోధక శక్తి పెరిగి ఎండ తీవ్రత నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఉదయం ఎండలు, రాత్రి చల్లటి గాలుల ప్రభావంతో చిన్నారుల్లో విరోచనాలు, దగ్గు, జలుబు, జ్వరం, వృద్ధుల్లో జ్వరంతో పాటు ఒళ్లు, కీళ్ల నొప్పులు, శ్వాసకోస, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తుండగా సమీపంలోని వైద్యులను సంప్రదించడం మేలు.
ఎండ త్రీవతను దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ, భవన నిర్మాణ, వ్యవసాయ కార్మికులు ప్రతి రోజు ఉదయం 11 గంటలకు పనులు పూర్తి చేసుకోవడం లేదా సాయంత్రం 4 గంటల తర్వాత పనులు చేసుకుంటే ఉత్తమం.
ఎండ తగలకుండా టోపీలు, ముఖానికి కర్చీఫ్ లేదా కండువా కప్పుకోవడంతో పాటు నీడపట్టున ఉండాలి. లూజు దుస్తులు ధరించాలి.
పనిచేస్తున్న సమయాన తలనొప్పి, కళ్లు తిరగడం, నీరసంగా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
వేసవిలో ఎండదెబ్బ తగలకుండా ఎక్కువ శాతం ఓఆర్‌ఎస్, మంచినీరు, మజ్జిగ, పండ్ల జ్యూస్ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా చిన్నారులను కూలర్లకు దగ్గరగా పడుకోపెట్టకూడదు. టూర్‌లకు వెళ్లే వారికి జాగ్రత్తలు తప్పనిసరి వాంతులు, వీరోచనాలు వంటి లక్షణాలు ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ ముక్కంటేశ్వరరావు,
చిన్నపిల్లల ప్రభుత్వ వైద్యుడు
ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బయట తిరగకూడదు. పనిచేస్తున్న సమయంలో అప్పుడప్పుడు నీడలో విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుడైన శరీరం డీహైడ్రేషన్‌కు గురైనట్లు తేలితే పండ్ల రసం, ఓఆర్‌ఎస్ వంటి ద్రావణాలు తీసుకోవడంతో పాటు వైద్యులను సంప్రదించాలి.
– రాజు, పీహెచ్‌సీ వైద్యుడు, జగన్నాధపురం


