భద్రాచలం/దుమ్ముగూడెం: ఏజెన్సీ ఏరియాలోని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై అధ్యయనం, వారి జీవనశైలిని తెలుసుకునేందుకు భద్రాచలం, దుమ్ముగూడెం మండలంలో గ్రూప్ వన్ శిక్షణ డిప్యూ టీ కలెక్టర్ల బృందం పర్యటించింది. గ్రూప్ వన్ ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ల రెండురోజుల శిక్షణలో భాగంగా భద్రాచలం ఏజెన్సీలో పర్యటిస్తున్నారు. ఈక్రమాన ఐటీడీఏ పీఓ సూచనల మేరకు శనివారం భద్రాచలంలోని గిరిజన వికాసం ప్రత్యేక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి అల్పాహారం తీసుకుని వారికి తర్ఫీదునిస్తున్న సిబ్బందిని అభినందించారు. అనంతరం బృంద సభ్యుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్ర పోషించి మంచి విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా నిష్ణాతులను చేయాలన్నారు. అదేవిధంగా దుమ్ముగూడెం మండలంలోని గౌరారం గ్రామపంచాయతీ పరిధి లింగాపూరం జీపీఎస్ పాఠశాలను సందర్శించిన బృంద సభ్యులు గ్రామంలోని మంచినీటి వసతి, వైద్యసేవలు, విద్య, అంగన్‌వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలు, భూ సమస్యలు, రోడ్డు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం లక్ష్మీనగరం గ్రామంలోని కే.రేగుబల్లి ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో కలిసిభోజనం చేశాక 10వ తరగతి విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళికలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్‌కుమార్, ఏఓ సున్నం రాంబాబు, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీడీఓ వివేక్ రామ్, సెక్రటరీ స్రవంతి, జీపీఓ వెంకన్న, సర్పంచ్ శ్యామల రవివర్మ, ఆర్‌ఐ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ అరుణకుమారి, గ్రామస్తులు పాల్గొన్నారు.
మండలాల్లో పర్యటించిన
డిప్యూటీ కలెక్టర్ల బృందం


