చండ్రుగొండ: బాధితుల ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదైన సంఘటన మండలంలోని జర్పులతండాలో జరిగింది. ఎస్‌ఐ శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు కార్యక్రమంలో భాగంగా జర్పులతండా గ్రామానికి చెందిన గుగులోతు రాములు ఇంటికి ఈ నెల 2న రాత్రి సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి మేకను అపహరించుకుని వెళ్లారు. బాధితుడి సమాచారం మేరకు సంఘటన స్థలానికి శనివారం వెళ్లిన పోలీసులు విచారణ జరిపి అక్కడే కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ కాపీని బాధితుడికి అందించారు.
అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిపై..
పాల్వంచరూరల్: మహిళపై మద్యం సేవించి అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచకు చెందిన ఆజ్మీరా అనుష గత నెల 30న తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా మండల పరిధి కోడిపుంజులవాగు గ్రామంలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కేక్ కట్టింగ్ అయ్యాక వీధులో వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన తేజావత్ రాధాకృష్ణ అకారణంగా అసభ్య పదజాలంతో దూషించి గొడవ పెట్టుకున్నాడని శనివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
అట్రాసిటీ కేసు నమోదు
ఇల్లెందు: వైన్స్‌షాప్ టెండర్‌లో పెట్టుబడి కోసం తన వద్ద డబ్బులు తీసుకొని తిరిగి అడిగితే కులం పేరుతో దూషించాడని పట్టణంలోని స్టేషన్‌బస్తీకి చెందిన కొండపల్లి గణేష్‌పై అదే బస్తీకి చెందిన బానోత్ గోపీచంద్ శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకొని నెలలు గడిచినా తిరిగి ఇవ్వకపోవడంతో ఊరకొండ ధనుంజయ్, దమ్మాలపాటి ప్రసాద్‌లతో కలిసి ప్రశ్నించేందుకు వెళితే తనను కులం పేరుతో దుర్భాషలాడాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు గణేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సీఐ సురేష్ తెలిపారు.


