అశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగారం ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు, కర్మాగారం ఉద్యోగి మలుకూరి వెంకటరెడ్డి (59) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రంలోని గౌతమీనగర్‌కాలనీలోని క్వార్టర్‌లో రాత్రి కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నా డు. ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఆరోగ్య సమస్యలే కారణమని మృతుడి తోడల్లుడు ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సీఐ అశోక్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా, ఏఐటీయూసీ డిఫెన్స్ విభాగం జాతీయ కమిటీ సభ్యుడిగా, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా, సహాయ కార్యదర్శిగా, డీసీ మెంబర్‌గా పనిచేసి, అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. ఆయన మృతదేహాన్ని జీఎం శ్రీనివాసరావు, అధికారులు, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు సందర్శించిన నివాళులర్పించారు.
ఐరన్ షాపులో
నగదు చోరీ
బూర్గంపాడు: సారపాకలోని ఓ ఐరన్ షాపులో గురువారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సారపాకలోని భవానీ ఐరన్ షాపులో గురువారం రాత్రి క్యాష్ కౌంటర్‌లోని రూ.30వేల నగదును దుండగులు చోరీ చేశారు. శుక్రవారం షాపు యజమాని వచ్చి చూసి, చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
పాల్వంచ: పట్టణ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఎస్‌ఐ నాగరాజు కథనం మేరకు.. బీసీఎం రోడ్‌లోని కేఎస్‌ఎం బంక్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయసు 55–60 ఏళ్ల మధ్య ఉంటుందని, గుర్తించినవారు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానీ 87126 82051 నంబర్‌లో గానీ సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.
చికిత్స పొందుతున్న
వ్యక్తి మృతి
రఘునాథపాలెం: మండలంలోని సుకినితండా వద్ద మూలమలుపులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని రాంక్యాతండాకు చెందిన మాలోతు సేటీ (54) గతనెల 29న కారేపల్లి నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా సుకినితండా వద్ద ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఆయనకు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. ఆపై వైద్యుల సూచనతో ఖమ్మం తీసుకొస్తుండగా మృతిచెందాడు. ఘటనపై సేటీ భార్య సేవ్రీ ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ ఫరీష్ తెలిపారు. కాగా, సేటీ కుటుంబీకులను సర్పంచ్ గుగులోతు మూర్తి, చిరుమామిళ్ల రవికిరణ్, అజ్మీరా ఈరునాయక్ పరామర్శించారు.


