మూడు జిల్లాల అవసరాలకు ఎరువులు | - | Sakshi
Sakshi News home page

మూడు జిల్లాల అవసరాలకు ఎరువులు

Apr 3 2026 7:26 AM | Updated on Apr 3 2026 7:26 AM

● ప్రాణం తీసిన ఆటో డ్రైవింగ్‌ ● ఆటో బోల్తాపడడంతో మృతిచెందిన యువకుడు

చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్‌ పాయింట్‌కు ఇఫ్‌కో కంపెనీకి చెందిన 2,676.96 మెట్రిక్‌ టన్నుల యూరియా గురువారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,176.96 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 800 మె.టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 500 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మిగతా 200 మెట్రిక్‌ టన్నులను బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేసినట్లు వెల్లడించారు.

పేకాట ఆడుతున్న ఐదుగురి అరెస్ట్‌

అశ్వారావుపేటరూరల్‌: అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి గుర్రాల చెరువు గ్రామ శివారులో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టుబడిన ఐదుగురి నుంచి రూ.3,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యయాతీ రాజు తెలిపారు.

నలుగురిపై కేసు నమోదు

జూలూరుపాడు: ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కల్గించడంతో పాటు దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. జూలూరుపాడు ఏఎస్సై వెంకట సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతనగర్‌ మండలానికి చెందిన అజ్మీర లక్ష్మణ్‌, అజ్మీర రాజ్‌కుమార్‌, బండి భాస్కర్‌, ఆదినారాయణలు జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో గురువారం లబ్ధిదారుల నుంచి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి ట్రాలీ ఆటోలో కొత్తగూడెం వైపు వస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సివిల్‌ సప్లై ఆర్‌ఐ నిక్కిలి వెంకటేశ్వర్లు కొమ్ముగూడెం శ్రీపెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఆ ట్రాలీ ఆటోను ఆపి తనిఖీ చేయగా 20 సూపర్‌ బస్తాల్లో బియ్యం ఉన్నట్లు గుర్తించి ఫొటోలు తీస్తున్నాడు. ఈక్రమంలో ఆ నలుగురు వ్యక్తులు ఆర్‌ఐని దుర్భాషలాడి, చంపుతామంటూ బెదిరించి, దాడి చేసి అక్కడ నుంచి ట్రాలీ ఆటోతో పారిపోయారు. ఆర్‌ఐ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వెంకట సుబ్బారావు పేర్కొన్నారు.

బంగారం చోరీపై..

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలంలో గత నెల 27న జరిగిన శ్రీరామనవమి వేడుకను చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూల్‌కు చెందిన చాకలి లక్ష్మి వచ్చింది. ముందుగా గోదావరి నదిలో స్నానం చేసిన ఆమె రాముల వారి కల్యాణానికి వెళ్లింది. ఈ క్రమంలో తన మెడలో ఉన్న సుమారు 37 గ్రాముల బంగారపు చైన్‌ మాయమైనట్లు గుర్తించి ఆ పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో గురువారం భద్రాచలం టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఎస్‌ఐ శ్యాంప్రసాద్‌ కేసు నమోదు చేశామన్నారు.

దుప్పులు వేటాడిన ఇద్దరు వ్యక్తులపై..

చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీకాలనీ అటవీ ప్రాంతంలో గురువారం దుప్పులను వేటాడిన ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు. స్థానికంగా నివాసముండే సాంబయ్య, సమ్మయ్య ఇద్దరు అటవీ ప్రాంతంలో ఉచ్చులు పెట్టడంతో రెండు దుప్పులు చిక్కగా వాటిని చంపారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారులు విచారణ చేపట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

సాగునీటి కోసం ఘర్షణ

ఇల్లెందురూరల్‌: మండలంలోని రేపల్లెవాడ గ్రామపంచాయతీ నిజాంపేట గ్రామంలో సాగునీటి కోసం గురువారం ఇద్దరు రైతులు ఘర్షణపడ్డారు. తన మొక్కజొన్న చేను ఎండిపోతుండడంతో రైతు అమడగాని భిక్షం పెద్దచెరువు కాలువ నుంచి నీటిని వినియోగించుకుంటున్నాడు. ఇదే సమయాన అక్కడకు వచ్చిన రైతు సూర్నపాక కోటేశ్వరరావు నీటిని తన పొలం దిశగా మళ్లించే ప్రయత్నం చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈక్రమంలో కోటేశ్వరరావు రాయితో భిక్షం తలపై కొట్టడంతో అతనికి తీవ్ర గాయమైంది. భిక్షం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్‌ తెలిపారు.

పెళ్లికి వచ్చి అనంతలోకాలకు..

ములకలపల్లి: పెళ్లికి వచ్చి విగతజీవిగా మారాడు ఓ యువకుడు. ఆటో నడుపుతూ ఫోన్‌ మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తాకొట్టి మృత్యువాతపడ్డాడు. ఎస్‌హెచ్‌ఓ లక్ష్మణ్‌ కథనం మేరకు.. మొగరాలగుప్ప గ్రామానికి చెందిన తానం శివ (25) సీతాయిగూడెం గ్రామంలో మిత్రుడు మడివి వీరస్వామి వివాహానికి బుధవారం వచ్చాడు. ఈక్రమంలో అదే పెళ్లికి వచ్చిన మిత్రుడు అశ్వాపురానికి చెందిన బొర్రా నరేందర్‌ ఆటోలో తోటిమిత్రులు మిడియం నవదీప్‌, సున్నం వంశీ, ఎలకం సతీష్‌లతో కలిసి సాయంత్రం మంగపేట గ్రామంలోని పెళ్లికి వచ్చారు. వివాహం అనంతరం తిరిగి రాత్రి సీతాయిగూడెం వెళ్తున్న క్రమంలో శివ ఆటో నడుపుతుండగా.. కమలాపురం శివారులోని చలమన్ననగర్‌ సమీపానికి రాగానే శివకు ఫోన్‌ రావడంతో సెల్‌ మాట్లాడుతుండగా అదుపు తప్పిన ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో శివ తలకు బలమైన గాయం కావడంతో దగ్గరలోని ఆస్పత్రుల్లో వైద్యం అందించి అక్కడి నుంచి ఖమ్మంకు తరలించగా.. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య ప్రియాంక, రెండేళ్లలోపు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement