రైల్వే బోర్డు చైర్మన్‌కు ఎంపీ విజ్ఞప్తి
ఖమ్మంమయూరిసెంటర్: కొత్తగూడెం(భద్రాచలం రోడ్డు) రైల్వేస్టేషన్ ఎదుట ప్రధాన రహదారి విస్తరణ చాన్నాళ్లుగా పెండింగ్ ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నందున భూమార్పిడి ప్రక్రియను త్వరగా ఆమోదించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. ఈమేరకు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్‌కు ఆయన ఢిల్లీలో వినతిపత్రం అందజేసి మాట్లాడారు. కొత్తగూడెం స్టేషన్ వద్ద 4,556 చ.మీ. రైల్వే భూమి రహదారి విస్తరణకు అవసరమని తెలిపారు. ఈ భూమి కేటాయిస్తే రహదారి విస్తరణ చేపట్టనుండగా ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని వెల్లడించారు. ఇందుకోసం ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద 3,969.5 చ.మీ. ప్రభుత్వ భూమిని రైల్వేశాఖకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఇరు జిల్లాల కలెక్టర్లు అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ 14న బోర్డుకు ప్రతిపాదన పంపిన నేపథ్యాన త్వరగా ఆమోదించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
కొనసాగుతున్న కబడ్డీ టోర్నీ
తల్లాడ: మండలంలోని కుర్నవల్లిలో నాలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి. వేంకటాచలపతి దేవాలయంలో తిరు కల్యాణం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు గురువారం రెండు తెలుగు రాష్టాలకు చెందిన జట్లు, తమిళనాడుకు చెందన నిలపురం, కర్ణాటక కుదునూరు జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగాయి. పోటీలను తల్లాడ ఏడీఈ సతీష్, ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించగా.. మ్యాచ్‌లు చూసేందుకు కుర్నవల్లి పరిసర గ్రామాల ప్రజలు హాజరయ్యారు.
ఆరు గ్యారంటీలు
అమలు చేయండి
మణుగూరుటౌన్: కేరళ ఎన్నికల పర్యటనలో రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి కేరళ సీఎం విజయన్‌కు ఓటేస్తే మోదీకి ఓటేసినట్లేనని చెప్పిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య అన్నారు. గురువారం స్థానిక శ్రామికభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు తప్ప మరే గ్యారంటీలు అమలు చేయలేదని, వైద్యాన్ని వ్యాపార మయం చేశారని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రూ.15వేలు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు, పిట్టల నాగమణి, సత్యనారాయణ, శ్రీను, గుండి భీమా తదితరులు ఉన్నారు.
వృద్ధుడిని చేరదీసిన ఎస్సై..
కరకగూడెం: ఆపదలో ఉన్న వృద్ధుడిని చేరదీసి తనలోని మానవత్వాన్ని చాటుకున్నాడు కరకగూడెం ఎస్సై పీవీఎన్.రావు. మండల పరిధి వట్టంవారిగుంపు గ్రామ పంచాయతీకి చెందిన వృద్ధుడు ఓర్సు మల్లయ్య గత కొన్ని నెలల క్రితం భార్య మరణించడంతో మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఎస్సై గురువారం ఆ వృద్ధుడిని చేరదీసి కటింగ్‌తో పాటు కొత్తబట్టలు అందజేసి ఆహారాన్ని పెట్టించాడు. పోలీసు అధికారిగా శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా వృద్ధుడి పట్ల ఆయన చూపిన చొరవను మండల ప్రజలు అభినందిస్తున్నారు.


