●విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన?
ఇల్లెందు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఒక ప్రాణం గాలిలో కలిసిపోయింది. విద్యుదాఘాతంతో బొజ్జాయిగూడెం పంచాయతీ మర్రిగూడెంనకు చెందిన కుంజా ఉదయ్ (34) మృతిచెందాడు. వివ రాలిలా ఉన్నాయి. బుధవారం పట్టణంలో ట్రాన్స్‌ఫార్మర్లు మార్చే పనులను కాంట్రాక్టర్ రాము చేపట్టారు. అందులో భాగంగా కూరగాయల మార్కెట్ ఎదురుగా ఆర్‌ఆర్ చికెన్ సెంటర్ వద్ద హైటెన్షన్ లైన్, లోకల్ లైన్లపై ఎల్‌సీ తీసుకున్నామని కూలీ, మర్రిగూడెంనకు చెందిన ఉదయ్‌ను స్తంభం పైకి ఎక్కించారు. ఉదయ్ విద్యుత్ లైన్‌ను ముట్టుకోగానే షాక్‌కు గురై పైనుంచి కింద పడ్డాడు. దీంతో విద్యుత్ సిబ్బంది, మిగతా కూలీలు భయంతో పరుగులు తీశారు. చుట్టుపక్కల వారు గమనించి క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఒకే స్తంభంపై రెండు లైన్లు ఉన్నా విద్యుత్ అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
బైక్ ఢీకొని ఒకరు..
దమ్మపేట: రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని గున్నేపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన చిలువేరు రమేశ్(32) హైదరాబాద్‌లోని సింధు పార్సిల్ సర్వీస్ సంస్థలో లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం హెదరాబాద్ నుంచి ఏపీలోని జంగారెడ్డిగూడెంనకు బయలుదేరాడు. రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో గున్నేపల్లి శివారుకు చేరుకోగా లారీ టైర్ పంక్చరైంది. దీంతో పంక్చర్ షాపు కోసం కాలి నడకన రోడ్డుపై ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన బూరుగు వంశీ, నారం నాగరాజు సత్తుపల్లి నుంచి మొద్దులగూడెం వైపునకు బైక్‌పై వస్తూ రమేశ్‌ను ఢీకొట్టారు. రమేశ్ తలకు తీవ్ర గాయం కాగా.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రమేశ్ పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. పార్సిల్ ఏజెంట్ మౌలాలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.
గాయపడిన వ్యక్తి ...
చండ్రుగొండ: మండల కేంద్రంలోని కేసీఆర్‌కాలనీకి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి వరంగల్‌లోని ఎంజీఎంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బుధవారం రాత్రి హెడ్‌కానిస్టేబుల్ రవి తెలిపారు. కేసీఆర్‌కాలనీకి చెందిన కణితి సిసింద్రి (27) మార్చి 26న బెండాలపాడులోని అత్తగారింటికి వెళ్లి వస్తానని ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చండ్రుగొండలోని చనగచెరువు సమీపంలో రోడ్డు పక్కన పంట చేలల్లో పడి పోయాడు. ఉదయం వాకింగ్ చేసే వ్యక్తులు గమనించి, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం కొత్తగూడెం అనంతరం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.


