ఇల్లెందురూరల్: మహిళ అంత్యక్రియలను అటవీశాఖ అధికారులు అడ్డుకున్న ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మండలంలోని ఇందిరానగర్ వడ్డెరకాలనీ ప్రజలు అంత్యక్రియలు నిర్వహించే భూమిని ఐదేళ్ల కిందట ఆ భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇందిరానగర్‌కు మంజూరైన వైకుంఠధామం కోసం ఆ భూమిలోనే కొంత స్థలం అటవీశాఖ అధికారులు కేటాయించారు. కానీ, వైకుంఠధామాన్ని వేరే ప్రాంతంలో నిర్మించడంతో ఆ భూమిని అర్బన్ పార్క్ నిర్మాణానికి కేటా యించారు. దీంతో అటవీశాఖ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టగా.. భవిష్యత్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు తమకు ద్వారం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. అందుకు నాటి అధికారులు అంగీకరించడంతో ఫెన్సింగ్ ఏర్పాటుకు స్థానికులు అభ్యంతరం తెలుపలేదు. మంగళవారం వడ్డెరకాలనీకి చెందిన మంజల వెంకటమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు స్థానికులు ఏర్పాట్లు చేశారు. అటవీశాఖ అధికారులు అడ్డుగా నిలిచి ఫెన్సింగ్ దాటి లోపలికి రావొద్దని స్పష్టం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరి స్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్థానికులు ఎమ్మెల్యే కోరం కనకయ్యను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో మహిళ మృతదేహాన్ని బాలాజీనగర్ వైకుంఠధామంలో ఖననం చేశారు.


