●రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఇల్లెందురూరల్/మహబూబాబాద్‌రూరల్: మరో పదిహేను రోజుల్లో పెళ్లి కుమారుడిగా ముస్తాబు కావాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివార్లలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు.. ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం జీపీ పరిధి నెహ్రూనగర్‌తండాకు చెందిన బానోత్ శ్రీను – వినోద దంపతుల ఏకై క కుమారుడు మహేందర్(23) హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన బైక్‌పై మహబూబాబాద్ మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఆయనకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చేరుకుని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ ఎస్‌ఐ సూరయ్య తెలిపారు.
15 రోజుల్లో రెండో మరణం
నెహ్రూనగర్‌కు చెందిన మహేందర్ కుటుంబంలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు. ఆయన తాత భోజ్యా పదిహేను రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఇప్పుడు మహేందర్ మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. కాగా, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యువతిని మహేందర్ ప్రేమించగా, ఇద్దరి పెళ్లికి పెద్దలు అంగీకకరించారు. దీంతో 15 రోజుల్లో వివాహ ముహూర్తం నిర్ణయించగా, ఆయన మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరయర్యారు.


