పాల్వంచరూరల్: మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో శ్రీదేవీ వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి లక్ష మల్లెపూలతో అర్చన, లలితా సహస్రనామం, చండీ సప్తసతీ పారాయణం, హో మం తదితర పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అలయ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ధర్మకర్తలు పెండ్లి రాంరెడ్డి, పాపారావు, శ్రీనివాసరావు, సందుపట్ల రమ్య, దుగ్గిరాల సుధాకర్, అడుసుమల్లి సాయిబాబా, శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
కాళీమాత ఆలయంలో విరూపాక్ష స్వామి పూజలు
మణుగూరు టౌన్: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కాళీమాత ఆలయాన్ని హంపి విరూపాక్ష భారతీ స్వామి శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు.. బీటీపీఎస్ రైలు మార్గం నిర్మాణంలో ఆలయంలో కొంతభాగం పోతుందని స్వామి వారి కి వివరించగా, ప్రభుత్వం ఆలయానికి స్థలం కేటాయించిన తర్వాత పునఃనిర్మాణానికి పూర్తి గా సహకరిస్తామని స్వామిజీ ప్రకటించారు. అనంతరం భక్తులను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పండితులు శ్రీకాంత్, దుర్గాప్రసాద్, సంతోష్, భార్గవ్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
బీటీపీఎస్‌లో విద్యుత్
సరఫరాకు అంతరాయం
రెండో యూనిట్‌లో సాంకేతిక లోపం..
మణుగూరురూరల్: మండల పరిధిలోని బీటీపీఎస్ రెండో యూనిట్‌లో శనివారం సాంకేతిక లోపం తలెత్తి 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. బాయిలర్‌లోని పైప్ లీకవడంతో సమస్య ఏర్పడిందని, ఉత్పత్తితో పాటు సరఫరాకూ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. మరమ్మతులు మొదలు పెట్టామని, రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని సీఈ బిచ్చన్న తెలిపారు.
సౌర విద్యుత్ ప్లాంట్ పరిశీలన
మణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని 33 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను జీఎం(ఈఅండ్‌ఎం, సోలార్ ఎనర్జీ)బి.సీతారామ్ శనివారం పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, కెపాసిటీ యుటిలైజేషన్ ఫ్యాక్టర్ వంటి సాంకేతిక అంశాలను పరిశీలించారు. ప్లాంట్‌లో అమర్చిన సోలార్ ప్యానెళ్ల సామర్థ్యం, ఇన్వర్టర్ పని తీరు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్విచ్‌బోర్డు వ్యవస్థల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కాగా, సీతారామ్ ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనుండగా, ఏరియా జీఎం రామచందర్, ఽఅధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాసాచారి, రాంబాబు, శ్రీనివాస్, ఎస్ రమేష్, శివప్రసాద్, వీరభద్రుడు, రమేష్, సురేష్ పాల్గొన్నారు.
ఉచిత హామీలతో మోసం చేస్తున్నారు..
అశ్వారావుపేటరూరల్: పాలకులు ఉచిత హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విమర్శించారు. శనివారం అశ్వారావుపేటలోని ఓ కల్యాణ మండపంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి దాకా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని నమ్మిన మవోయిస్టులు ప్రస్తుతం పోలీసుల వద్ద లొంగిపోతున్నారని, వారి భవిష్యత్ ఏమి టో కొద్ది కాలం వేచి చూడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఏమి లేదని, హామీలను విస్మరించి కొత్త పేర్లతో పథకాలను తెచ్చి మభ్యపెడుతున్నారని అన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోగినపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా జాటోతు కృష్ణ, కోశాధికారిగా బుర్రా వెంకన్న, ఉపాధ్యక్షులుగా దాసరి సాయి, సహాయ కార్యదర్శిగా నాయిని రాజు, 17 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.


