● పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్ ద్వారా కేంద్రాలు ● ఉమ్మడి జిల్లాలో 41కేంద్రాల ఏర్పాటు
ఖమ్మంవ్యవసాయం: యాసంగిలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల కష్టాలు తీర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంట సాగు చేసిన ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొక్కజొన్న క్వింటాకు మద్దతు ధర రూ. 2,400గా ప్రకటించినా ప్రైవేటు మార్కెట్‌లో వ్యాపారులు రూ.1,600కు మించి చెల్లించడం లేదు. దీంతో క్వింటాకు రూ.800 మేర రైతులు నష్టపోతుండడంతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఈనేపథ్యాన ప్రభుత్వం మక్కల కొనుగోళ్లకు ముందుకొచ్చింది. ఎప్పటిలాగే మార్క్‌ఫెడ్‌కు కొనుగోలు బాధ్యతలు అప్పగించగా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల సూచనలతో కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
పంట సాగైన ప్రాంతాల్లో..
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యాన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లు, జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ల ద్వారా మక్కల కొనుగోళ్లు చేపడతారు. పంట అత్యధికంగా సాగైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ ఏడాది యాసంగి పంటగా ఖమ్మం జిల్లాలో 1.67లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 72వేల ఎకరాల్లో మక్కలు సాగయ్యాయి. ఖమ్మంజిల్లాలోనిచింతకాని, కొణిజర్ల, బోనకల్, రఘునాథపాలెం, ముదిగొండ, ఏన్కూరు తదితర మండలాలు, భద్రాద్రి జిల్లాలోని టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి తదితర మండలాల్లో మక్కల సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. పంట ఎక్కువగా సాగైన మండలాల్లో రెండు నుంచి మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మొత్తంగా ఖమ్మంలో జిల్లాలో 30, భద్రాద్రి జిల్లాలో 11 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. తొలి కేంద్రాన్ని ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో శుక్రవారం ప్రారంభించగా, ఏప్రిల్ మొదటి వారంకల్లా అన్ని కేంద్రాలను దశల వారీగా ప్రారంభించనున్నారు.


