కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
టేకులపల్లి: నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉంటే తీవ్రంగా అవమానిస్తున్నారని, దీంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మండలానికి చెందిన భూక్య దళ్‌సింగ్‌నాయక్, ఆయన భార్య, మాజీ సర్పంచ్ భూక్య గంగా తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. 1987లో పార్టీలో చేరానని, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా ఉంటూ పార్టీలోనే కొనసాగానన్నారు. అనేక పార్టీలు మారి వచ్చినవారే తనను దూరం పెడుతున్నారని తెలిపారు. 2019లో అధిక స్థానాలు బీఆర్‌ఎస్ గెలిస్తే చుక్కాలబోడులో కాంగ్రెస్ తరఫున తన భార్య గంగాబాయిని ఏకగ్రీవం చేసిన ఘనత తనదేనని, ఇప్పుడు కూడా ఏకగ్రీవం చేద్దామని గ్రామస్తులు కోరితే తనను సంప్రదించకుండానే ఎమ్మెల్యే తరఫున వేరే అభ్యర్థితో నామినేషన్ వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలతోనే రాజీనామా చేస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. కార్యక్రమంలో భూక్య రంజిత్, భూక్య రమేశ్, నాగేశ్వరరావు, బిచ్చా, బీక్య, జగపతి, బాలాజీ, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.


