కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
టేకులపల్లి: ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఒంటెత్తు పోకడలతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పలు సామాజిక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే వారు పార్టీని వీడుతున్నారని, ఇదే కొనసాగితే ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ అన్నారు. ఆదివారం టేకులపల్లిలోని హరిప్రియ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ నాయకుడు భూక్య దళ్‌సింగ్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్‌రావుతో పాటు మాజీ దళకమాండర్ పూనెం సమ్మయ్య, పలువురు వార్డు సభ్యులు ఎంపీ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 17న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటి అధిక స్థానాలు గెలుచుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దిండిగల రాజేందర్, బొమ్మెర్ల వరప్రసాద్, ఆమెడ రేణుక, హరిసింగ్ నాయక్, రవి పాల్గొన్నారు.


