మంత్రి స్వగ్రామంలో కాంగ్రెస్‌దే గెలుపు | - | Sakshi
Sakshi News home page

మంత్రి స్వగ్రామంలో కాంగ్రెస్‌దే గెలుపు

Dec 15 2025 8:55 AM | Updated on Dec 15 2025 8:55 AM

మంత్ర

మంత్రి స్వగ్రామంలో కాంగ్రెస్‌దే గెలుపు

దమ్మపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లి సర్పంచ్‌గా కాంగ్రెస్‌ బలపర్చిన మెచ్చు ఈదప్ప విజయం సాధించాడు. ఇక్కడ పోటీలో ఉన్న బీఆర్‌ఎస్‌ మద్దతుదారుడు పండు సాంబశివరావుపై ఆయన 350 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అంతేకాక పది వార్డులకు ఏడింటిని కాంగ్రెస్‌ కై వసం చేసుకుంది.

రాజుపేట

బీఆర్‌ఎస్‌ కై వసం

కూసుమంచి: కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో బీఆర్‌ఎస్‌ మద్దతుదారుడు బానోత్‌ మహేష్‌ సర్పంచ్‌గా గెలుపొందాడు. పాలేరు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య స్వగ్రామం ఇదే కావడంతో నాయకులు ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. మరోపక్క కాంగ్రెస్‌ నాయకులు కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు. ఇక్కడి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ మహేష్‌ కాంగ్రెస్‌ బలపర్చిన కుర్రా రమేష్‌పై 23 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు.

బీటెక్‌ సర్పంచ్‌ !

కామేపల్లి: కామేపల్లి మండలం పొన్నేకల్‌లో కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన గుగులోత్‌ భూమిక సర్పంచ్‌గా గెలిచింది. ఇక్కడ మొత్తం 842 ఓటర్లకు గాను 728 ఓట్లు పోలయ్యాయి. ఈమేరకు భూమిక 603 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందింది. బీటెక్‌(ఈఈఈ) పూర్తి చేసిన ఆమె 23 ఏళ్ల వయస్సులోనే గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికవడం విశేషం. విద్యావంతురాలినైన తాను గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ప్రచారంలో వెల్లడించింది.

ఎమ్మెల్సీ స్వగ్రామంలో బీఆర్‌ఎస్‌ మద్దతుతో

సీపీఎం విజయం

తిరుమలాయపాలెం: ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్‌ స్వగ్రామమైన పిండిప్రోలులో బీఆర్‌ఎస్‌ మద్దతుతో సీపీఎం సర్పంచ్‌ అభ్యర్థి కామళ్ల సువార్త 381ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఆమెకు 1,750 ఓట్లు రాగా మాస్‌లైన్‌ అభ్యర్థి ఆరెంపుల కేతమ్మకు 1,369 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 12 వార్డులకు గాను కాంగ్రెస్‌, మాస్‌లైన్‌ అభ్యర్థులు నాలుగు వార్డులు కై వసం చేసుకోగా, బీఆర్‌ఎస్‌, సీపీఎం కూటమికి ఎనిమిది వార్డులు దక్కాయి.

పోరాడి ..

విజయం సాధించి

ములకలపల్లి : తిమ్మంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికై న తుర్రం శ్రీనివాసరావు అవిశ్రాంతంగా పోరాడుతూ, పరాజయాలను అధిగమిస్తూ విజయాన్ని చేజిక్కుంచుకున్నారు. శ్రీనివాస్‌ టీడీపీ నుంచి 2013లో పీఏసీఎస్‌ డైరెక్టర్‌గా పోటీ చేసి పరాయజం పాలయ్యారు. ఆ తర్వాత ఐక్యకూటమి అభ్యర్థిగా ఉమ్మడి తిమ్మంపేట జీపీ సర్పంచ్‌గా పోటీ చేసి మరోమారు ఓటమి చెందారు. 2019లో తిమ్మంపేట ఎంపీటీసీగా శ్రీనివాసరావు భార్య ఈశ్వరి బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసినా విజయం దరిచేరలేదు. అయినా శ్రీనివాసరావు పట్టువదలని విక్కమార్కుడిలా ఈ దఫా తిమ్మంపేట సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి, సమీప సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ అభ్యర్థి మడకం రాజులుపై 264 ఓట్ల ఆఽధిక్యంతో విజయం సాధించారు.

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

కరకగూడెం: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికల్లో మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు తోలెం బాలకృష్ణ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. పాల్వంచలోని కిన్నెరసాని మోడల్‌ స్పోర్ట్స్‌ స్కూల్లో ఆదివారం నిర్వహించిన శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన బాలకృష్ణ.. ఈ నెల 20 నుంచి 24 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీనియర్‌ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఇంకా ఈ నెల 25 నుంచి 28 వరకు కరీంనగర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకూ ఎంపికై నట్లు స్పోర్ట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తెలిపారు.

మంత్రి స్వగ్రామంలో  కాంగ్రెస్‌దే గెలుపు1
1/1

మంత్రి స్వగ్రామంలో కాంగ్రెస్‌దే గెలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement