అక్రమాలకు సహకార సంస్థ
అధికారులు, సిబ్బంది,
డీలర్లు రిమాండ్
జీసీసీ సిబ్బంది, డీలర్లు కలిసి రేషన్ బియ్యం స్వాహాకు యత్నం
లారీ సన్న బియ్యం దారిమళ్లించి ఓ మిల్లు సమీపంలోకి చేరవేత
ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు రాకుండానే వచ్చినట్లు రికార్డులో నమోదు
సస్పెండ్ చేస్తున్నా తీరు మారని
జీసీసీ అధికారులు, సిబ్బంది
నకిలీ ఎంట్రీలు, డీలర్ల బయోమెట్రిక్‌తో..
పాల్వంచరూరల్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అధికారులు, సిబ్బంది, డీలర్లు కలిసి సన్నబియ్యం కాజేద్దామని పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. రేషన్ బియ్యంతో వచ్చే లారీ పాల్వంచలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు రాకుండా మధ్యలోనే దారిమళ్లించారు. కానీ లారీ ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు వచ్చి గోదాంలో బియ్యం అన్‌లోడ్ చేసినట్లు, అక్కడి నుంచి డీలర్లు తీసుకెళ్లినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. డీలర్లు కూడా బయోమెట్రిక్ నమోదు చేసి సంతకాలు పెట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలతో వ్యవహారం వెలుగు చూడగా, నిందితులు కటకటాలపాలయ్యారు.
జీసీసీలో గోల్‌మాల్?
గిరిజన సహకార సంస్థలో తరచూ అవకతవకలు జరుగుతున్నాయి. పాల్వంచలోని జీసీసీ గోదాములో ఎంఎల్‌ఎస్ పాయింట్ నిర్వహిస్తుండగా, ఇక్కడి నుంచి పాల్వంచ, బూర్గంపాడు, ములకలపల్లి మండలాల్లోని రేషన్ షాపులకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే బియ్యం నిల్వల్లో గోల్‌మాల్ జరుగుతోంది. గోదాం ఇన్‌చార్జులే సూత్రదారులుగా మారి అవకతవకలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో గతంలో ముగ్గురు ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా మరో ఇద్దరి సస్పెన్షన్‌కు డీఎం ఉన్నతాధికారులకు శనివారం ప్రతిపాదనలు పంపారు.
జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను మార్చి..
పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లిలోని జీసీసీ పర్యవేక్షణలో ఉన్న గోదాంను పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌ఎస్ పాయింట్‌గా కొనసాగిస్తోంది. ఈ నెల 2న మణుగూరులోని మల్లారం స్టాక్ పాయింట్ నుంచి సన్న రేషన్ బియ్యం లోడ్ ఇక్కడి ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు బయల్దేరింది. బూర్గంపాడు మండలంలోకి ప్రవేశించాక బియ్యం లోడ్‌ను నకిరిపేట సమీపంలోని ఓ మిల్లు వద్ద ఉంచి, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను మార్చారు.
ప్రతి నెలా 6 వేల క్వింటాళ్లు రవాణా
జీసీసీ అధికారుల పర్యవేక్షణలో ఉన్న ఎంల్‌ఎస్ పాయింట్ గోదాం నుంచి ప్రతి నెలా మూడు మండలాల్లోని రేషన్ షాపులకు సమారు ఆరు వేల క్వింటాళ్ల బియ్యం తరలిస్తున్నారు. 86 రేషన్ దుకాణాలకు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సరఫరా చేస్తున్నానరు. ఈ క్రమంలో జీసీసీ అధికారులు, సిబ్బంది కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారు.
గతంలోనూ అవకతవకలు
ఏడాది క్రితం పౌరసరఫరాలశాఖ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జీసీసీ గోదాంలోని బియ్యం నిల్వలను తనిఖీ చేయగా, 395 క్వింటాళ్ల తేడా వచ్చింది. మధ్యాహ్న భోజనానికి సరఫరాచేసే బియ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో గోదాం ఇన్‌చార్జిగా ఉన్న మొగిలి వెంకటేశ్వర్లును సస్పెండ్ చేశారు. అంతకుముందు రూ.14 లక్షల ముష్టి గింజల అక్రమాల ఘటనలో అకౌంటెంట్, గోదాం ఇన్‌చార్జిగా సంజీవరావు, కల్తీ కృష్ణతోపాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఇలా అధికారులు, సిబ్బంది చేతివాటానికి పాల్పడుతూ జీసీసీకి కళంకం తెస్తున్నారు.
జీసీసీ గోదాంల సముదాయంలో ఏర్పాటు చేసిన ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను ఇక్కడ నుంచి తొలగించాలని పౌరసరఫరాల శాఖ అధికారులను పలుమార్లు కోరాం. అయినా వారు తరలించడంలేదు. దీంతో మాకు చెడ్డపేరు వస్తోంది.
–లక్ష్మణ్, జీసీసీ మేనేజర్
బియ్యం కాజేసేందుకు ప్రయత్నించిన ఘటనలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఫిర్యాదుతో జీసీసీ గోదాం ఇన్‌చార్జి, డేటా ఎంట్రీ ఆపరేటర్, కాంట్రాక్టర్, 8 మంది రేషన్ డీలర్లతో సహా మొత్తం 15 మందిపై పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రిమాండ్‌కు తరలించినవారిలో ఎన్.శ్రీనివాస్ (కాంట్రాక్టర్)తోపాటు ప్రశాంత్, సత్యావతి, కృష్ణకుమార్, అనిల్‌కుమార్, ఎన్.రాజయ్య, రమేష్ చంద్రరాఠి, కె.శ్రీనివాసరావు, కె.చంద్రం, కలీ, ఎ.లక్ష్మీదేవి, పి.శ్రీకాంత్, భద్రమ్మ, నరహరి, నాగరాజు ఉన్నట్లు ఎస్‌ఐ సుమన్ తెలిపారు.
జీసీసీ గోదాం ఇన్‌చార్జి సత్యావతి, డేటా సెంటర్ ఆపరేటర్ కృష్ణకుమార్, హమాలీ నాగరాజు సహకారంతో స్టాక్ పాయింట్ నుంచి లారీ గోదాముకు వచ్చినట్లు నకిలీ ఎంట్రీలు చేశారు. డీలర్లు గోదాం నుంచి రేషన్ బియ్యం తీసుకున్నట్లు బయోమెట్రిక్ సంతకాలు చేశారు. బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేసి లారీని పట్టుకున్నారు. 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 15 మందిపై కేసు నమోదు చేశారు. గోదాం ఇన్‌చార్జి, ఆపరేటర్లపై సస్పెన్షన్ వేటు వేయాలని ఉన్నతాధికారులకు రిపోర్టు చేసినట్లు డీఎం సమ్మయ్య తెలిపారు.


