అతిపెద్దది.. అతి చిన్నది
తుది విడతలో అడవి రామారం
భద్రాచలం పంచాయతీలో అత్యధికంగా 40,761 మంది ఓటర్లు అడవి రామారంలో అత్యల్పంగా 85 మంది మాత్రమే.. ఉమ్మడి జిల్లాలో 88 ఓట్లతో రెండో చిన్న పంచాయతీగా దొంగతోగు
చుంచుపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతి పెద్ద గ్రామపంచాయతీగా నిలిచింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం ఇక్కడే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీలో 40,761 మంది ఓటర్లు ఉండగా, ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వుడ్ చేశారు. 20 వార్డుల్లో 5 స్థానాలు ఎస్టీ జనరల్, 5 స్థానాలు ఎస్టీ మహిళ, మరో 5 స్థానాలు జనరల్‌కు, 5 స్థానాలు జనరల్ మహిళకు కేటాయించారు. సర్పంచ్ స్థానానికి ఐదుగురు, వార్డులకు 75 మంది బరిలో నిలిచారు. భద్రాచలం పంచాయతీతోపాటు మండల కేంద్రంగా కూడా కొనసాగుతోంది.
1982లో తొలిసారి ఎన్నికలు..
తొలిసారి 1982లో భద్రాచలం మేజర్ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత 1987లో న్యాయపరమైన అడ్డంకులతో ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత 2001లో పట్టణంగా ప్రకటించి ఈఓ పాలన తీసుకొచ్చారు. 2005లో మున్సిపాలిటీగా ఏర్పాటు చేయగా, అది కూడా న్యాయపరమైన చిక్కులతో రద్దయింది. మళ్లీ 2013లో ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత 2018 మళ్లీ మున్సిపాలిటీగా మార్చే ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో 2019లో ఎన్నికలు జరగలేదు. అనంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వం భద్రాచలం పట్టణాన్ని మూడు పంచాయతీలుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం భద్రాచలం పట్టణాన్ని ఒకే పంచాయతీగా కొనసాగించడంతోపాటు 14 ఎంపీటీసీ స్థానాలతో తిరిగి మండల కేంద్రంగా ఏర్పాటు చేసింది.
ఆళ్లపల్లి మండలంలోని అడవి రామారం ఉమ్మడి జిల్లాలోనే అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామ గ్రామపంచాయతీగా నిలిచింది. ఇక్కడ 107 మంది మాత్రమే జనాభా ఉంది. కేవలం 85 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 40 మంది, పురుషులు 45 మంది ఉన్నారు. సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్ కేటాయించగా, నాలుగు వార్డుల్లో నాలుగు ఎస్టీలకే ఖరారు చేశారు. గ్రామ పంచాయతీకి తుది విడతలో ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి. అడవి రామారం పినపాక నియోజకవర్గంలో అత్యంత మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి రహదారి సౌకర్యం లేని కుగ్రామం. 2018లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా మర్కోడు గ్రామం నుంచి విడదీసి అడవి రామారాన్ని కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఇక గతంలో దొంగతోగు గ్రామం రాష్ట్రంలోనే అతిచిన్న పంచాయతీగా నిలిచింది. ఇది గుండాల నుంచి విడిపోయి 2018లో కొత్తగా ఏర్పాటైంది. తాజా లెక్కల ప్రకారం దొంగతోగు గ్రామపంచాయతీ 88 మంది ఓటర్లతో ద్వితీయస్థానంలో నిలిచింది. ఇందులో పురుషులు 48మంది, మహిళలు 40 మంది ఉన్నారు.
అతిపెద్దది.. అతి చిన్నది


