యాసంగిలో 6,250 ఎకరాలకే సాగునీరు
పాల్వంచరూరల్: జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద 41,900 ఎకరాల ఆయకట్టు ఉండగా, యాసంగిలో 6,250 ఎకరాలకే సాగునీరు అందించనున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ సీఈ సుధీర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీకి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. మధ్యతరహా జలాశయాల్లో నీటి నిల్వ సామర్థ్యం 9.527 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.349 టీఎంసీలు మాత్రమే ఉందని పేర్కొన్నారు. సరిపడా నీళ్లు లేనందున ఆయకట్టుకు 0.75 టీఎంసీల సాగు నీరు అందిస్తామని తెలిపారు. కిన్నెరసాని జలాశయం కింద ఆయకట్టు 10 వేల ఎకరాలు ఉండగా, 0.1 టీఎంసీల నీటిని వెయ్యి ఎకరాలకు అందిస్తామని, తాలిపేరు ప్రాజెక్టు కింద 24,700 ఎకరాల ఆయకట్టు ఉండగా 4వేల ఎకరాలకు 0.40 టీఎంసీల నీటిని, బయ్యారం పెద్దచెరువు కింద 7,200 ఎకరాల ఆయకట్టు ఉండగా, 1,250 ఎకరాల ఆయకట్టుకు 0.25 టీఎంసీల సాగునీరు అందిస్తామని వివరించారు. పెద్దవాగు ప్రాజెక్టులో నీళ్లు లేనందున అక్కడి ఆయకట్టుకు నీరు అందించలేమని సీఈ తెలిపారు. కాగా ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మధ్యతరహా ప్రాజెక్ట్‌ల కింద
ఆయకట్టుకు కటకట


