
ప్రాణాలతో చెలగాటం !
హోల్‌సేల్ షాపుల దగ్గర
పాటించాల్సిన రక్షణ చర్యలు..
నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లలోనే బాణ సంచా నిల్వలు హోల్‌సేల్ షాపుల నిర్వహణలోనూ నిర్లక్ష్యం రక్షణ చర్యలు శూన్యం ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోని అధికార యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఒకప్పుడు దీపావళి టపాకాయలను తమిళనాడులోని శివకాశి నుంచి స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసి అమ్మేవారు. గత రెండేళ్లుగా జిల్లాలోనే హోల్‌సేల్ దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ షాపుల వద్ద సైతం నిబంధనల ఉల్లంఘన సాగుతోంది.
మొక్కుబడిగా..
హోల్‌సేల్ షాపులు ఆరంభించేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని హామీలు ఇచ్చే వ్యాపారులు ఆ తర్వాత నిర్లక్ష్యం వహిస్తున్నారు. మంటలు అంటుకునే స్వభావం ఉండే వస్తువులు హోల్‌సేల్ షాపుల దగ్గర ఉండకూడదు. కానీ ఈ షాపుల దగ్గర భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సరిపడా ఫైర్ ఎక్సిటింగ్ విషర్‌లు లేవు. ఫైర్ ఫైటింగ్‌లో శిక్షణ పొందిన సిబ్బంది కేవలం కాగితాల్లోనే ఉన్నారు. హోల్‌సేల్ షాపులో టేబుల్ వేసి మరీ స్టాక్ ఉన్న బాణ సంచాకు సంబంధించిన ప్యాకెట్లను ఓపెన్ చేసి షో పీస్‌లను ప్రదర్శిస్తున్నారు. అయితే ఇటీవల భద్రాచలంలో బాణ సంచా అక్రమ విక్రయాలపై దాడులు జరగడం, ఏపీలో బాణ సంచా తయారీ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో ఈ పరిస్థితిలో గురువారం మార్పులు చోటు చేసుకున్నాయి. షో పీస్‌లు తొలగించారు. మొక్కుబడిగా ఒకటి రెండు అన్నట్టుగా ఫైర్ ఎక్సిటింగ్ విషర్‌లు ఏర్పాటు చేశారు. ఇక వాటర్ ట్యాంకులు, వాటి పనితీరు ఎలా ఉందనేది ప్రశ్నార్థకమే.
ఇప్పటికీ మారనితీరు..
గతంలో శివకాశి నుంచి కొనుగోలు చేసిన సందర్భాల్లో చాలా మంది బాణ సంచా స్టాక్‌ను తమ ఇళ్లు, లేదా ఇతర వ్యాపారాలకు సంబంధించిన గోదాముల్లో నిల్వ చేసే వారు. హోల్‌సేల్ షాపులు వచ్చిన తర్వాత ఈ పద్ధతికి చాలా మంది స్వస్తి పలికారు. కానీ, కొందరు ఈ పద్ధతిని ఇప్పటికీ మార్చుకోవడం లేదు. కొత్తగూడెంలో పెద్ద బజార్‌లో ఒక వ్యాపారి, రామాటాకీస్ ఏరియాలో మరొకరు ఈ తరహాలో బాణ సంచాను ప్రమాదకర పరిస్థితుల్లో నిల్వ ఉంచుతున్నారు. ఇక రామవరం ఏరియాలో ఓ ఖద్దరు నేత ఇంటినే బాణ సంచా దుకాణంగా మార్చారు. మణుగూరు పట్టణంలో టీడీపీ సెంటర్ దగ్గర ఒకరు, పూల మార్కెట్ దగ్గర ఇద్దరు వ్యాపారులు తమ ఫ్యాన్సీ స్టోర్ గోదాముల్లోనే బాణ సంచా నిల్వలు ఉంచినట్టు ఆరోపణలు వస్తున్నాయి. పాల్వంచలో సీతారామపట్నం దగ్గర ఓ ఇంట్లో మరో వ్యాపారి, ఇల్లెందులో ఆంబజార్ ఏరియాలో కొందరు వ్యాపారులు వీటిని ఇళ్లలోనే నిల్వచేసుకుంటూ ప్రమాదాలతో చెలగాటం ఆడుతున్నారు. వీరంతా దీపావళితో పాటు వివిధ శుభ, అశుభ కార్యాలకు అవసరమైనప్పుడు బాణసంచాను విక్రయిస్తున్నారు. ఈ విషయంపై వివరణ కోసం జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి ఎం. క్రాంతికుమార్ సంప్రదించగా ఆయన సెలవులో ఉన్నారు. దీంతో కొత్తగూడెం ఫైర్ ఆఫీసర్ పుల్లయ్యను సంప్రదించగా అనుమతి లేకుండా పరిమితికి మించి ఇళ్లలో కానీ షాపుల్లో కానీ ఎవరైనా అక్రమంగా బాణ సంచా నిల్వ చేస్తే చర్యలు తప్పవని, అక్రమ నిల్వలపై సమాచారం ఇస్తే తనిఖీలు చేపడతామని చెప్పారు.
తయారీదారుడు ప్యాక్ చేసిన రీతిలోనే బాణసంచాను డిస్‌ప్లేలో ఉంచాలి. ప్యాక్ ఓపెన్ చేసి ఉంచకూడదు
5 కేజీల సామర్థ్యం కలిగిన డీసీపీ ఫైర్ ఎక్సిటింగ్ విషర్‌లు ఆరు ఉండాలి. 4.5 కేజీల సామర్థ్యం కలిగిన సీఓటూ ఎక్సిటింగ్ విషర్‌లు రెండు ఉండాలి
బాణ సంచా నిల్వ చేసే గోదాం పైభాగంలో 1000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, దిగువ భాగంలో 450 లీటర్ల సామర్థ్యం కలిగిన నీళ్ల ట్యాంకులు (బూస్టర్ పంప్‌తో కలిపి) ఉండాలి. వీటికి అనుసంధానమైన వాటర్ పైపులు, హోస్‌లు కండిషన్‌లో ఉండాలి
అగ్ని, పొగలను గుర్తించే ఆటోమేటిక్ అలారమ్ ఏర్పాటు చేసుకోవాలి
నో స్మోకింగ్‌తో పాటు సదరు దుకాణం దగ్గర చేయాల్సిన, చేయకూడని చర్యలను తెలిపే బోర్డులు ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి
ఫైర్ ఫైటింగ్‌లో శిక్షణ పొందిన వారిని ఇక్కడ నియమించాలి
పోలీసులు, ఫైర్‌సేఫ్టీ, రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ రక్షణ చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేది పరిశీలించాల్సి ఉంటుంది.

ప్రాణాలతో చెలగాటం !