
పత్తి ధరలో దగా!
బూర్గంపాడు: ఈ ఏడాది అధిక వర్షాలు, తెగుళ్లు పత్తి రైతులను కలవరపెడుతున్నాయి. దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళన వారిని వేధిస్తోంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా చేతికొస్తున్న పంటను అమ్ముదామంటే కొనే నాథుడు లేడు. కేంద్రం మద్దతు ధర ప్రకటించినా.. ప్రైవేట్ వ్యాపారులు తేమ పేరుతో అందులో సగం ధరకే కొంటున్నారు. ప్రతికూల వాతావరణంతో అసలే దిగుబడి రాక దిగులు చెందుతుండగా ధరల పతనం రైతులను మరింతగా కలవరపెడుతోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పత్తి అమ్మాలంటే సీసీఐ కొనుగోలు కేంద్రాలు తప్పనిసరి. కానీ ప్రభుత్వం ఇంతవరకు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో పెట్టుబడి అవసరాల కోసం తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది.
పెరిగిన సాగు
జిల్లాలో పత్తి సాగు గతేడాది కంటే పెరిగింది. సుమారు 2.21 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేయగా 20 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలు పత్తిపంటను నష్టపరిచాయి. ప్రతికూల వాతావరణంతో చేలు ఆశాజనకంగా లేవు. ఎరువులు, పురుగుమందుల వినియోగంతో పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. ఎకరాకు కనిష్టంగా రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది సగటున ఎకరాకు ఐదారు క్వింటాళ్లకు మించి దిగుబడి రాదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో తొలివిడత పత్తి తీతలు కొనసాగుతుండగా అమ్మితే వచ్చిన డబ్బు కూలీలకు, పురుగుమందులకు వెచ్చిద్దామని భావించారు. కానీ కొనుగోళ్లు చురుగ్గా సాగడం లేదు. స్థానిక వ్యాపారులు క్వింటా పత్తిని రూ.3వేల నుంచి 4వేల మధ్యనే అడుగుతున్నారు. దీంతో రైతులు పత్తి అమ్మాలా, నిల్వ ఉంచాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. కొందరు అవసరాల కోసం తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.
రూ.5వేలకు మించని ధర
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి క్వింటాకు రూ. 8,110 మద్దతు ధర ప్రకటించింది. బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధర దక్కనప్పుడు సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో పత్తి ధర క్వింటా రూ.5వేలకు మించడం లేదు. జిల్లా రైతులు పత్తిని విక్రయించేందుకు సరైన మార్కెట్ సౌకర్యాలు లేవు. ఖమ్మం, వరంగల్ వెళ్లాలంటే రవాణా ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అక్కడికి వెళ్లినా తేమ శాతం ఎక్కువగా ఉందని, నాణ్యత లేదనే సాకుతో ధరలో విపరీతంగా కోతపెడుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిన అవసరముంది. తేమ ఎక్కువగా ఉంటుందనే కారణంతోనే సీసీఐ కేంద్రాల ప్రారంభంలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
సీసీఐ కేంద్రాలు తెరిస్తే తప్ప పత్తికి ధర రాదు. ఊళ్లలో వ్యాపారులు క్వింటా రూ.4వేల నుంచి రూ.5వేలకే అడుగుతున్నారు. క్వింటా పత్తి తీసేందుకే కూలీలకు రూ.3,500 ఖర్చవుతోంది. రూ.ఐదు వేలకు అమ్మితే పెట్టుబడి కూడా రాదు. ఈసారి పదెకరాల్లో పత్తి వేయగా ఐదెకరాలు వరదలకు దెబ్బతిన్నది. మిగతా ఐదెకరాల్లో 30 క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదు. సీసీఐ కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. – ధరావత్ శ్రీను,
బోజ్యాతండా, జూలూరుపాడు మండలం
ఈ ఏడాది భారీ వర్షాలు, వరదలకు పత్తిచేలు దెబ్బతిన్నాయి. మొక్కలు పెరిగినా కాపు నిలువలేదు. ఎన్ని ఎరువులు వేసినా, మందులు కొట్టినా పెద్దగా మార్పు లేదు. దీనికి తోడు ధర కూడా లేకపోవడంతో ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం పత్తి అమ్మితే ఆ డబ్బులు పత్తి ఏరిన కూలీలకే సరిపోతున్నాయి.
– నిమ్మల రాములు, రైతు, నాగినేనిప్రోలు,
బూర్గంపాడు మండలం
çÜ$gê™èl¯]lVýSÆŠæḥ: ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశా. రూ.2లక్షల వరకు పెట్టుబడి ఖర్చయింది. అధిక వర్షాలతో పంట దెబ్బతిని కాయలు నల్లబారుతున్నాయి. పూత, పిందె రాలిపోతోంది. పెట్టుబడి కూడా వచ్చేలా లేదు.
–వెంకటకృష్ణ, సుజాతనగర్

పత్తి ధరలో దగా!

పత్తి ధరలో దగా!