
జ్వరంతో టెక్నికల్ అసిస్టెంట్ మృతి
చర్ల: జ్వరంతో బాధపడుతున్న క్రమంలో ప్లేట్‌లెట్స్ పూర్తిగా తగ్గి ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ మృతి చెందాడు. బూర్గంపాడు మండలంలోని వేపలగడ్డకు చెందిన కనితి సతీష్ (45) పదేళ్లుగా చర్లలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మంగళవారం హైదరాబాద్‌లోని నిమ్స్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జ్వరంతో బాదపడుతున్న క్రమంలో ప్లేట్‌లెట్స్ పూర్తిగా తగ్గి మృతి చెందాడు. మృతిపట్ల ఇన్‌చార్జి ఏపీఓ సాంబశివరావు, సిబ్బంది సంతాపం తెలిపారు.
ముద్దాయికి ఐదేళ్ల జైలు శిక్ష
కొత్తగూడెంటౌన్: ప్రైవేట్ చిట్టీల పేరుతో మోసం చేసిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు చెప్పారు. కొత్తగూడెం గంగాబిషన్‌బస్తీకి చెందిన జక్కుల వెంకన్న చిట్టీలు కట్టించుకుని, తమకు రావాల్సిన రూ.16,41,000 చెల్లించకుండా మోసం చేశాడని అదే ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్‌తోపాటు మరో 20 మంది కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. 22 మంది సాక్షులను విచారించిన అనంతరం జక్కుల వెంకన్నపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మి వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్‌ఐ ఆర్ ప్రభాకర్, కోర్టు లైజన్ ఆఫీసర్ నేరేడు వీరబాబు, పీసీ కె.వీరన్న సహకరించారు.