ఆయిల్‌ఫెడ్‌ అదుర్స్‌! | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ఫెడ్‌ అదుర్స్‌!

Oct 10 2025 6:02 AM | Updated on Oct 10 2025 6:02 AM

ఆయిల్‌ఫెడ్‌ అదుర్స్‌!

ఆయిల్‌ఫెడ్‌ అదుర్స్‌!

పామాయిల్‌ దిగుబడి, ఓఈఆర్‌ వివరాలు

అతి త్వరలోనే లక్ష్యసాధన

గణనీయంగా పెరుగుతున్న ఓఈఆర్‌

పామాయిల్‌ రికవరీ రేటు(ఓఈఆర్‌) ఏటా గణనీయంగా పెరుగుతోంది. దమ్మపేట మండలంలోని అప్పారావుపేటలో 2017లో ఏర్పాటుచేసిన అధునాతన ఫ్యాక్టరీతో ఓఈఆర్‌ పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. టీజీ ఆయిల్‌ఫెడ్‌ ద్వారా వచ్చిన ఆయిల్‌ రికవరీ రేటు శాతం ఆధారంగానే ఏపీలో ఉన్న ప్రైవేట్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఆయిల్‌పామ్‌కు ధరను ప్రకటించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆయిల్‌ రికవరీ రేటు 19.90 పైగా ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, ఇదే జరిగితే ఆయిల్‌ఫెడ్‌ చరిత్రలోనే ఈ ఆయిల్‌ సంవత్సరపు ఓఈఆర్‌ అత్యధికం కానుంది.

అదనపు ఫ్యాక్టరీల నిర్మాణం

టీజీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.22 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల ఎకరాల్లో సాగు చేపడుతున్నారు. సుమారు 70 వేల ఎకరాల నుంచి గెలల దిగుబడి వస్తోంది. కొన్నేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో గెలల దిగుబడి కూడా ఏటా పెరుగుతోంది. దిగుబడికి అనుగుణంగా ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో అదనపు ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో అప్పారావుపేట, అశ్వారావుపేటల్లో పామాయిల్‌ ఫ్యాక్టరీలు ఉండగా, సిద్దిపేటలోని నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తిచేసుకుంది. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరుగూడెంలో ఫ్యాక్టరీ నిర్మాణం వడివడిగా కొనసాగుతోంది. గెలల దిగుబడి పెరగడంతో అశ్వారావుపేటలో మరో అదనపు ఫ్యాక్టరీని కూడా త్వరలోనే నిర్మించనున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు సిద్దిపేట, నారాయణపేట, గద్వాల్‌, జనగాం, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి తదితర ప్రాంతాల్లో సేకరణ కేంద్రాల ద్వారా గెలలను సేకరించి, లారీల్లో అప్పారావుపేట ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు.

దిగుబడి లక్ష్యాలు

ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతుండటంతో దిగుబడి లక్ష్యాలు కూడా పెరుగుతున్నాయి. 2020–21లో ఆయిల్‌ఫెడ్‌ పామాయిల్‌ గెలల దిగుబడి లక్ష్యం 2 లక్షల టన్నులు కాగా 2024–25కు మూడు లక్షల టన్నులకు చేరుకుంది.

ఆయిల్‌ దిగుబడి లక్ష్యం దిగుబడి

(ఓఈఆర్‌ సంవత్సరం) (టన్నుల్లో) (టన్నుల్లో)

2020–21 2,00,000 2,29,380 19.22

2021–22 2,25,000 2,64,520 19.32

2022–23 2,50,000 2,70,375 19.17

2023–24 2,75,000 2,27,110 19.42

2024–25 3,00,000 2,95,000

ఆయిల్‌ ఫెడ్‌ లక్ష్యానికి అతి చేరువలో ఉంది. మరో వారం రోజుల్లో టార్గెట్‌ పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఆయిల్‌ సంవత్సరంలో మూడు లక్షల టన్నుల పామాయిల్‌ గెలల సేకరణను ఆయిల్‌ ఫెడ్‌ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నెల 7వ తేదీ వరకే 2.95 లక్షల టన్నులను సేకరించింది. రేటు అనేక ఎత్తుపల్లాలు చవిచూసినా ప్రస్తుతం టన్ను గెలల ధర రూ.19,400తో ఆశాజనకంగా ఉంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతాంగం స్థిర ఆదాయం ఇచ్చే ఆయిల్‌పామ్‌ సాగు వైపు ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో ఏటా సాగు విస్తీర్ణంతోపాటు పంట దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతోంది. గెలల క్రషింగ్‌ కోసం యాజమాన్యం కూడా అదనపు ఫ్యాక్టరీలను నిర్మిస్తోంది. కాగా నవంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 31వరకు ఆయిల్‌ సంవత్సరంగా పేర్కొంటారు. –దమ్మపేట

ప్రస్తుత ఆయిల్‌ సంవత్సరంలో నిర్దేశించిన పామాయిల్‌ గెలల దిగుబడి లక్ష్యాన్ని అతి త్వరలోనే అధిగమించబోతున్నాం. ఆయిల్‌పామ్‌ తోటల సాగు విస్తీర్ణంతోపాటు గెలల దిగుబడి కూడా పెరిగింది. అత్యధిక ప్రమాణాలు కలిగిన ఆధునిక యంత్రాల ద్వారా క్రషింగ్‌ చేయడం ద్వారా ఆయిల్‌ రికవరీ రేటు శాతం గణనీయంగా పెరుగుతోంది.

– కల్యాణ్‌, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement