
విరిగిపడ్డ సీతమ్మ తల్లి బొమ్మ
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులకు రామాయణ ఇతివృత్తం తెలిసేలా గోదావరి కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన బొమ్మలు విరిగిపోతున్నాయి. ప్రముఖ చిత్రకారుడు బాపు నేతృత్వంలో రామాయణ ముఖ్య ఘటనలకు సంబంధించిన బొమ్మలను ఏళ్ల క్రితం ఇక్కడ ఏర్పాటు చేశారు. అధికారులు నిర్వహణను పట్టించుకోకపోవడంతో ఆకతాయిలు బొమ్మలను విరగగొడుతున్నారు. సీతమ్మ తల్లి బొమ్మ విరిగి కిందపడి ఉండటంతో భక్తులు అసహనం చెందుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించి, రక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
12న యోగా పోటీలు
కొత్తగూడెంటౌన్: హైదరాబాద్‌లో ఈ నెల 12న జరగనున్న రాష్ట్రస్థాయి యోగా పోటీలను విజయవంతం చేయాలని టీవైటీసీసీ ఉమ్మడి జిల్లాల చైర్మన్ గుమలాపురం సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఆదియోగ పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. విజేతలకు రూ.10 వేల నగదు, పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేస్తారని తెలిపారు. వివరాలకు 92902 10218 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
కిన్నెరసాని
ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయంలో వరద కొనసాగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 1,200 క్యూసెక్కుల వరదనీరు రావడంతో గురువారం నీటిమట్టం 406.70 అడుగులకు పెరిగింది. ప్రాజెక్ట్‌కు చెందిన ఒక గేటును ఎత్తివేసి 4వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు.
ఇసుక లారీ, జేసీబీ సీజ్
బూర్గంపాడు: మండలంలోని లక్ష్మీపురం గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని, లోడ్ చేస్తున్న జేసీబీని గురువారం పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు.
మహిళ అదృశ్యం
భద్రాచలంఅర్బన్: పట్టణంలో జగదీష్ కాలనీకి చెందిన వివాహిత విమల బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకి వెళ్లి తిరిగి రాలేదు. గురువారం ఆమె భర్త రాజుదేవర రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కోతుల దాడిలో
రైతుకు గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని చల్లసముద్రం క్యాంపు సెంటర్ గ్రామానికి చెందిన రైతు షేక్ మౌలానా గురువారం కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యాహ్న సమయంలో పొలం వద్దకు వెళుతున్న ఆయన్ను కోతులు వెంబడించాయి. చుట్టుముట్టి దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. గమనించిన స్థానికులు కర్రలతో అక్కడకు చేరుకుని కోతులను తరిమివేశారు. రైతుకు స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు.
దాడి ఘటనలో
కేసు నమోదు
ఇల్లెందురూరల్: దాడి ఘటనలో పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని బియ్యని దినేష్ అనే వ్యక్తి తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ మండలంలోని ములకలపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొర్లగుంపు గ్రామానికి చెందిన దినేష్ తరచూ ములకలపల్లి గ్రామానికి వచ్చి తనపట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని, ప్రశ్నించినందుకు కర్రలతో దాడిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలు
అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామ సమీపంలో మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మణుగూరుకు చెందిన సీహెచ్. రాము(38) తన భార్య ఇద్దరు పిల్లలతో బైక్‌పై భద్రాచలం నుంచి మణుగూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మొండికుంట గ్రామ సమీపంలో సువ్వల మోరి వద్ద మణుగూరు నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న డీసీఎం వాహనం బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రాము తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో భద్రాచలం తరలించారు. సీఐ అశోక్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మణుగూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.