
మిషన్ భగీరథ వాల్వ్‌లో పడి వ్యక్తి మృతి
కరకగూడెం: మిషన్ భగీ రథ స్కోర్ వాల్వ్‌లో పడి ఓ వ్యక్తి మృతి సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. అశ్వాపురం మండలం మల్లెలమడుగు ఎస్సీ కాలనీకి చెందిన వంగూరి వెంకన్న (43) కొద్ది రోజులుగా తాటిగూడెం గ్రామంలో ఉంటున్నాడు. కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి వంట సామాన్ల కోసం దుకాణానికి వెళ్తున్న సమయంలో ప్రధాన రహదారి పక్కన తెరుచుకుని ఉన్న మిషన్ భగీరథ స్కోర్ వాల్వ్‌లో పడిపోయాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తోటి కూలీలు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా మిషన్ భగీరథ స్కోర్ వాల్వ్‌ను అసంపూర్తిగా, సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లారీ, బైక్ ఢీ :
విద్యార్థి మృతి
పాల్వంచరూరల్: పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బీటెక్ విద్యార్థి మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జర్పుల చరణ్(22) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. హైదరాబాద్‌లో పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు వెళ్లేందుకు మంగళవారం అర్ధరాత్రి పాల్వంచ వెంగళరావుకాలనీలోని బంధువు పవన్ బైక్ తీసుకుని వెళ్తున్నాడు. అదే సమయంలో ములకలపల్లి వైపు వెళ్తున్న లారీ పాల్వంచ దమ్మపేట సెంటర్‌లో టర్నింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో లారీ డ్రైవర్ ఇండికేటర్ ఇవ్వకపోవడంతో బైక్ ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలై చరణ్ మృతి చెందాడు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదుతో లారీ డ్రైవర్ ఉకే కళ్యాణ్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ సుమన్ తెలిపారు.