
అస్తవ్యస్తంగా విద్యాశాఖ!
దరఖాస్తుదారులందరూ ఉత్తములేనా..?
ఇన్‌చార్జుల పాలనతో పాఠశాలలపై కొరవడిన పర్యవేక్షణ
అధికారులు, ఉద్యోగుల మధ్య అంతర్గత కుమ్ములాట
సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా విధులు
కొత్తగూడెంఅర్బన్: డీఈఓ సహా ఎంఈఓలు కూడా ఇన్‌చార్జిలే కావడంతో జిల్లా విద్యాశాఖలో పర్యవేక్షణ కొరవడింది. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో విద్యార్థులకు నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. పాలన కూడా గాడితప్పుతోంది. గత నెలలో డీఈఓ వెంకటేశ్వరాచారి ఉద్యోగ విరమణ చేశారు. దీంతో జెడ్పీ సీఈఓకు ఇన్‌చార్జ్ డీఈఓ బాధ్యతలు అప్పగించారు. అప్పటికే గందరగోళంగా మారిన విద్యాశాఖ ఇన్‌చార్జిలతో అస్తవ్యస్తంగా తయారవుతోంది. విద్యాశాఖ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడింది. కుమ్ములాటలు ఎక్కువ కావడంతో ఓ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్‌కు గురయ్యాడు.
ఇన్‌చార్జులే అధికం..
జిల్లా విద్యాశాఖలో డీఈఓ సహా ఎంఈఓలు అందరూ ఇన్‌చార్జులే. ప్రస్తుతం డీఈఓ నాగలక్ష్మి జెడ్పీ సీఈవోగా కూడా పని చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆమె ఎక్కువ సమయం ఎన్నికల విధులకే కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యాశాఖపై దృష్టి సారించడం కష్టమవుతోంది. జిల్లాలోని 23 మండలాల్లో ఒక్కరూ రెగ్యులర్ ఎంఈఓ లేరు. దీంతో పర్యవేక్షణ కుంటుపడుతోంది. ఎంఈఓలు పాఠశాలల హెచ్‌ఎంలుగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. హెచ్‌ఎం, ఎంఈఓ విధులతోపాటు పాఠ్యంశాల బోధన కూడా చేయాల్సి ఉంటుంది. దీంతో వారిపై పనిభారం పడుతోంది. ఫలితంగా విద్యార్థులకు సరైన బోధన అందడంలేదు. అన్ని రకాల బిల్లుల్లో కూడా జాప్యం జరుగుతోంది. పదో తరగతి విద్యార్థులపై కూడా ప్రభావం పడుతోంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినా పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించలేదు. ప్రత్యేక తరగతుల్లో ఇచ్చే స్నాక్స్‌పై కూడా స్పష్టత లేదు. విద్యాశాఖ కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు పక్క జిల్లాల నుంచి రోజూ విధులకు వచ్చి వెళ్తున్నారు. సమయపాలన పాటించకుండా ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నారు. డీఈఓ కార్యాలయంలో చేతులు తడపందే పనులు కాని పరిస్థితి నెలకొంది. విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి రెగ్యులర్ డీఈఓను నియమించాలని లేదా ఖమ్మం తరహాలో అదనపు కలెక్టర్‌కు/విద్యాశాఖలోని అధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్‌లోనే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ జరగాల్సి ఉంది. కొరత ఉన్న పాఠశాలల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల నుంచి టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉంది. సబ్జెక్ట్ టీచర్ల కొరత లేకుండా చూడాలి. కానీ సెప్టెంబర్ వచ్చినా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ జరగలేదు. జిల్లాలో ఈ సంవత్సరం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఆదర్శ బోధన పద్ధతులు అవలంబించేవారిని ఆధారాలతో గుర్తించి ఉత్తములుగా ఎంపిక చేయాల్సి ఉంది. కానీ దరఖాస్తుదారులందరినీ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.