
ఉత్తములకు అవార్డుల ప్రదానం
కొత్తగూడెంఅర్బన్: కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయులకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు దేశ భవిష్యత్‌కు మార్గనిర్దేశకులు అని పేర్కొన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు పొందిన చండ్రుగొండ మండలం గుర్రాయిగూడెం ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం బి.ప్రవీణను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, డీఈఓ నాగలక్ష్మి, చండ్రుగొండ ఎంఈఓ అభినందించారు. అనంతనం మిగతా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరభ్‌శర్మ, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విత్తన సేకరణలో పాఠశాలలకు బహుమతులు
ఇల్లెందురూరల్/జూలూరుపాడు: విత్తన సేకరణలో జూలూరుపాడు హైస్కూల్ మండలస్థాయిలో ప్రథమ బహుమతి దక్కించుకుంది. శుక్రవారం కలెక్టర్ జితేష్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణలు రూ.5,000లు నగదు పురస్కారం, జ్ఞాపికను ఉపాధ్యాయులకు అందజేశారు. ఇల్లెందు మండలం ముత్తారపుకట్ట ప్రాథమిక పాఠశాలకు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కబ్బాకుల రవి, ఉమ, శాంతకుమారిలను అభినందించారు.
మణుగూరు ప్రిన్సిపాల్‌కు రాష్ట్రస్థాయి అవార్డు
మణుగూరు టౌన్: మణుగూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నల్లగడ్డ సత్యప్రకాశ్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రిన్సిపాల్‌గా అవార్డు అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రాణా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సత్యప్రకాశ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు మరింత కృషి చేస్తానని తెలిపారు.

ఉత్తములకు అవార్డుల ప్రదానం