
గురువులదే గురుతర బాధ్యత
● ఐటీడీఏ పీఓ రాహుల్ ● గిరిజన ఉపాధ్యాయులకు ఘన సత్కారం
భద్రాచలం: విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులేదనని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గిరిజన భవన్‌లో నిర్వహించిన గురుపూజోత్సవాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కవిత రూపంలో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ విద్యతోపాటు సామాజికంగా విద్యార్థులను తీర్చదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 116 పాఠశాలలకు మెడికల్ కిట్లు అందించారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. సన్మానం చేశారు. ఉద్దీపకం–2 రూపకల్పనలో సహకారం అందించినవారికి కూడా పురస్కారాలు ఇచ్చారు. బీఈడీ, డీఈడీ కళాశాలల్లో 100 శాతం ర్యాంకుల సాధనకు కృషి చేసిన లెక్చరర్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మణెమ్మ, రమేష్, రాములు, అశోక్ కుమార్, చంద్రమోహన్, అలివేలు మంగతాయారు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.