
రూ.350 కోట్లతో ప్రతిపాదనలు
విడతల వారీగా బడ్జెట్ కేటాయించాలని నివేదిక
రామాలయ కొత్త మాస్టర్ ప్లాన్‌పై వైదిక కమిటీ కినుక..?
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, దేవాదాయ శాఖ ఉన్నతాఽధికారులు ప్రాథమిక నమూనా సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో కలెక్టర్ ఆలయ అధికారులతోపాటు వైదిక కమిటీ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉంటుందని, ప్రధాన ఆలయంలో మార్పులు లేకుండా ఇతర అభివృద్ధి పనులు చేపతామని పేర్కొన్నారు.
నాలుగు విడతలుగా..
రామాలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధి నాలుగు విడతల్లో చేపట్టేలా నూతన నమూనాలో ప్రతిపాదనలు రూపొందించారు. తొలి విడతలో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ పూర్తి చేయాలని ప్రతిపాదించారు. మండపాలు, క్యూ హాళ్లు, ప్రసాదం విభాగం, అడ్మినిస్ట్రేషన్ భవనాలు ఉన్నాయి. ఇందుకు రూ. 115 కోట్లు అవసరమని సూచించారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల అభివృద్ధిని రెండో విడతలో ప్రాధాన్యాంశాలుగా పేర్కొన్నారు. ఇందులో విస్తా కాంప్లెక్స్, అడ్మిన్ బ్లాక్, ఘాట్లు, రహదారులు ఉన్నాయి. ఈ పనులను రూ.35 కోట్లతో ప్రతిపాదించారు. మూడో విడతలో కరకట్టకు దిగువ భాగాన ఉన్న కాపా రామలక్ష్మమ్మ భూమిని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇది గతంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండగా, సుదీర్ఘ కాలం కోర్టులో వాదనల అనంతరం రామాలయ సొంతమైంది. ఇందులో రామాయణ మ్యూజియం, తూము నర్సింహాదాసు ఆడిటోరియం, భక్త రామదాసు ప్లాజా, మల్టీ లెవల్ పార్కులు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకు రూ.100 కోట్లతో ప్రతిపాదించారు. ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి పనులకు నాలుగో విడతలో ప్రతిపాదించారు. హోటళ్లు, గిరిజన మ్యూజియం, రామవనం, పట్టణ సుందరీకరణ పనుల చేపట్టేలా పొందుపర్చారు. ఇందుకోసం రూ.100 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఇలా మొత్తం రూ.350 కోట్లతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీన్ని సర్కారు ఆమోదించి తగిన బడ్జెట్ విడుదల చేయాల్సి ఉంది.
భద్రాచలం రామాలయ అభివృద్ధికి ప్రణాళిక