ఆమోదిస్తే సవరణే... | - | Sakshi
Sakshi News home page

ఆమోదిస్తే సవరణే...

Sep 6 2025 5:19 AM | Updated on Sep 6 2025 5:19 AM

ఆమోదిస్తే సవరణే...

ఆమోదిస్తే సవరణే...

మార్కెట్‌ విలువతో పోలిస్తే భూమి రిజిస్ట్రేషన్‌ ధరలో హెచ్చుతగ్గులు దీన్ని సవరించేలా గత ఏడాది కమిటీల ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించిన రిజిస్ట్రేషన్ల శాఖ సీఎం సూచనలతో అమలైతే ఉమ్మడి జిల్లాలోనూ ప్రభావం

పలుచోట్ల ధరల పెంపు ప్రతిపాదనలు

సాక్షిప్రతినిధి, ఖమ్మం: వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్‌ విలువ సవరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత ఏడాది జూన్‌లో ధరల సవరణకు ప్రభుత్వం కమిటీలను నియమించింది. స్టాంపులు రిజిస్ట్రేషన్‌ శాఖ, రెవెన్యూ అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీలు అన్ని జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ భూముల విలువ సవరణకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వానికి నివేదించారు. ఆతర్వాత ప్రక్రియ నిలిచిపోయింది. గతనెలలో ఓఆర్‌ఆర్‌ లోపల, వెలుపల 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలోనే విలువ సవరణ ప్రతిపాదనలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించింది. కానీ రాష్ట్రమంతటా సవరించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించడంతో గతేడాది పంపిన ప్రతిపాదనల మేరకు పెంచేలా కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం.

రెండేసి కమిటీలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్‌ విలువ నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంది. గతంలో అత్యధిక ధర ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం మార్కెట్‌ విలువ స్తబ్దుగా ఉంది. వీటిని సవరించేందుకు గత ఏడాది జూన్‌లో కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామీణ కమిటీలకు ఆర్డీఓ చైర్మన్‌గా, తహసీల్దార్‌, ఎంపీడీఓ, మార్కెట్‌ వాల్యూ సబ్‌ రిజిస్ట్రార్లు సభ్యులుగా, స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ను కన్వీనర్‌గా ఉన్నారు. అర్బన్‌ కమిటీలకు అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) చైర్మన్‌గా, జెడ్పీ సీఈఓ, మున్సిపల్‌ కమిషనర్‌, సుడా వైస్‌ చైర్మన్లు సభ్యులుగా, స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ను కన్వీనర్‌గా నియమించారు.

ప్రభుత్వానికి నివేదికలు

కమిటీలు పలు ప్రాంతాల్లో ధరల్లో తేడాలను పరిశీలించాయి. ఉమ్మడి జిల్లాలోని 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో భూముల విలువ సవరణ కోసం ప్రతిపాదనలను గత ఏడాది జులైలో ప్రభుత్వానికి పంపారు. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్‌ విలువ, బహిరంగ మార్కెట్‌ విలువ ఆధారంగా కొన్నిచోట్ల పెంపు, ఇంకొన్ని చోట్ల తగ్గింపునకు ప్రతిపాదించారు. వీటి ప్రకారం ఖమ్మం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో భూ ధరలు భారీగా పెరిగే అవకాశముంది. కమర్షియల్‌ ప్రాంతాలను పక్కాగా గుర్తించి ధరలు పెంచేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సమర్పించారు.

పూర్తిస్థాయి పరిశీలన కోసం..

భూముల మార్కెట్‌ విలువ సవరణపై ప్రభుత్వానికి నివేదిక అందాక ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా రిజిస్ట్రార్లు, సబ్‌ రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించారు. ధరల పెంపు మరింత పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా వ్యత్యాసాలు ఉండకూడదని ఆదేశించారు. దీంతో ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కర్ణాటకలో పరిశీలనకు ఓ కమిటీ వెళ్లగా.. అందులో జిల్లా రిజిస్ట్రార్‌ కూడా ఉన్నారు.

ప్రతిపాదనలకే సై...

ఉమ్మడి జిల్లాలో భూముల మార్కెట్‌ విలువ సవరణపై అందిన ప్రతిపాదనలను ఆమోదించే అవకాశముందని తెలుస్తోంది. తద్వారా ఖమ్మం కలెక్టరేట్‌ ప్రాంతంలోని రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం, చింతకాని మండలం వందనం, కొణిజర్ల మండలం తనికెళ్ల, అమ్మపాలెం రెవెన్యూ పరిధిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ భారీగా పెరిగే అవకాశముంది. ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ప్రభుత్వ, బహిరంగ మార్కెట్‌ ధర ఆధారంగా అన్నిరకాల భూముల ధరలు 50 శాతం వరకు పెరగొచ్చని భావిస్తున్నారు. కాగా, బహిరంగ మార్కెట్‌ ధరకు దగ్గరగా ఉన్న చోట మాత్రం యథావిధిగా కొనసాగించన్నుట్లు తెలుస్తోంది.

కొత్తగూడెం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధి : నివాస ప్రాంతాల్లో గజం కనీస ధర రూ.300 నుంచి రూ.500కు, గరిష్ట ధర రూ.29,900 నుంచి రూ.32వేల మేర పెంపునకు ప్రతిపాదించారు.

వాణిజ్య ప్రాంతాల్లో కనీస ధర రూ.1,700 నుంచి రూ.2 వేలకు, గరిష్ట ధర రూ.29,900 నుంచి రూ.32వేలకు పెంచాలని సూచించారు.

అపార్ట్‌మెంట్లో చదరపు అడుగు ధరను రూ.1,300 నుంచి రూ.1,500కు, గరిష్ట ధర రూ.3వేల నుంచి రూ.3,200 పెంచొచ్చని తెలిపారు.

వ్యవసాయ భూమి ఎకరా కనీస ధర రూ.2,25 లక్షల నుంచి రూ.4,లక్షలకు, గరిష్ట ధర రూ.52.50 లక్షల నుంచి రూ.55 లక్షలకు పెంచేలా ప్రతిపాదించారు.

భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం : నివాస ప్రాంతాల్లో గజం కనీస ధర రూ.500 నుంచి రూ.800కు, గరష్ట ధర రూ.7,800 నుంచి దానిని రూ.10వేలకు పెంచొచ్చని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

వాణిజ్య ప్రాంతాల్లో కనీస ధర రూ.4,800 నుంచి రూ.6 వేలకు, గరిష్ట ధర రూ.7,800 నుంచి రూ.15 వేలకు ప్రతిపాదించారు.

అపార్ట్‌మెంట్లలో కనీస ధర రూ.1,300 నుంచి రూ.1,500కు పెంచాలని, గరిష్ట ధరను కొనసాగించాలని సూచించారు.

వ్యవసాయ భూమి ఎకరా కనీస ధరను రూ.2,25 లక్షల నుంచి రూ.4లక్షలకు, గరిష్ట ధర రూ.2.25లక్షల నుంచి రూ.4లక్షలకు మించి పెంచేలా ప్రతిపాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement