
స్వర్ణకవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
రామభక్తుల
మన్ననలు పొందాలి
భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసువావాలని, వారి మన్ననలు పొందాలని ఈఓ కె.దామోదరరావు సూచించారు. నూతన ఈఓగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా శుక్రవారం దేవస్థానంలోని ప్రొవిజన్ స్టోర్, లడ్డూ ప్రసాదాల తయారీతో పాటు కౌంటర్లను ఆయన పరిశీలించారు. ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రవణ్‌కుమార్, సాయిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ చైర్మన్ బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
‘కారుణ్యం’లో
గ్రేడ్–3 క్లర్క్ పోస్టులు
సింగరేణి యాజమాన్యం అంగీకారం
కొత్తగూడెంఅర్బన్: గని ప్రమాదాల్లో మృతి చెందిన ఉద్యోగుల వారసుల కోసం చేపట్టే కారుణ్య నియామకాల్లో పట్టభద్రులైన అభ్యర్థులను క్లరికల్ గ్రేడ్–3 పోస్టుల్లో నియమించేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌తో యాజమాన్యం ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది. 2009లో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్ చదివినవారు, డిప్లొమాలో మైనింగ్, మెకాని కల్, ఎలక్ట్రికల్, ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ కోర్సులు చేసినవారితోపాటు డిగ్రీని కూడా అర్హతగా చేర్చారు. బాధిత కుటుంబాల్లో అర్హులైన టెక్నికల్ డిగ్రీ ఉన్న వారసులు లేనిపక్షంలోనే, ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారిని నియమించేలా నిర్ణయం తీసుకున్నారు. సంస్థలో గ్రేడ్–3 క్లర్కు పోస్టుల లభ్యత, కంపెనీ నిర్వహించే ప్రత్యేక పరీక్ష ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. గ్రేడ్–3 క్లర్కు పోస్టుల అర్హత పరీక్షలో ఉత్తీర్ణులుకాని వారసులను కేటగిరీ–1లో జనరల్ అసిస్టెంట్‌గా గుర్తిస్తూ ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎంలు కవితా నాయు డు, వై.రఘురామిరెడ్డి, వెంకట రామిరెడ్డి, డి.వెంకటేశ్వర్లు, ఏజీఎం కె.అజయ్‌కుమార్, గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ కె.రాజ్‌కుమార్, నాయకులు మిర్యాల రంగయ్య, కె.సారయ్య, వైవీరావు, వంగా వెంకట్, ఎస్.రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణకవచధారణలో రామయ్య

స్వర్ణకవచధారణలో రామయ్య