ఇక్కడి నుంచే సమరశంఖం ! | - | Sakshi
Sakshi News home page

ఇక్కడి నుంచే సమరశంఖం !

Sep 2 2025 7:10 AM | Updated on Sep 2 2025 7:10 AM

ఇక్కడి నుంచే సమరశంఖం !

ఇక్కడి నుంచే సమరశంఖం !

సీఎం పర్యటన నేపథ్యాన ఆంక్షలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమం వేదికగా అధికార కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమర శంఖాన్ని జిల్లా నుంచే పూరించనుందా అంటే అవుననే సమాధానం హస్తం వర్గాల నుంచి వస్తోంది. చండ్రుగొండ సభ ఏర్పాట్లు సైతం అలాగే ఉంటున్నాయి.

పార్లమెంట్‌కూ ఇక్కడి నుంచే..

తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2024లో పార్లమెంట్‌ ఎన్నికలు జరగగా.. అంతకుముందే 2024 మార్చి 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఈ సభలో వెల్లడించారు. అదే రోజు సాయంత్రం మణుగూరులో ప్రజాదీవెన పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరై మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్‌కు పరిచయం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్‌ వెలువడకముందే కాంగ్రెస్‌ తరఫున తొలి ఎన్నికల ప్రచారం జిల్లాలో ప్రారంభించారు. ఆ తర్వాత కొత్తగూడెం సభకు కూడా సీఎం వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులుగా బలరాంనాయక్‌, రామసహాయం రఘురామిరెడ్డి విజయం సాధించారు.

ఈసారీ అంతేనా..?

స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వం లేఖ రాసింది. మరోవైపు ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు వంటి పనులు చకచకా సాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని అనధికారికంగా కాంగ్రెస్‌ ప్రారంభించబోతోందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల బహిరంగ సభ తరహాలోనే ఆత్మీయ సభ ఏర్పాట్లు జరుగుతుండడం ఈ విశ్లేషణలకు బలం చేకూరుస్తోంది. లక్ష మంది హాజరయ్యేలా అత్యంత భారీగా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, వైరా, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇందిరమ్మ లబ్ధిదారులతో పాటు భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా ఈ సభలో ప్రజల మధ్యకు వచ్చి సీఎం అభివాదం చేసేలా 48 అడుగుల పొడవుతో వాకింగ్‌ ర్యాంప్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చిన ప్రతీ ఒక్కరికి సీఎం స్పష్టంగా కనిపించేలా భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ఉండే మూడు రంగులు ప్రస్ఫుటంగా కనిపించేలా సభా ప్రాంగణాన్ని తీర్చి దిద్దుతున్నారు. ఓవైపు ఏర్పాట్లు ఘనంగా సాగుతుంటే మరోవైపు కారుమబ్బులు కాంగ్రెస్‌ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

కొత్తగూడెంటౌన్‌: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 3న చండ్రుగొండ మండలంలో పర్యటించనున్న నేపథ్యాన ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు కొత్తగూడెం డీఏస్పీ అబ్దుల్‌ రెహమాన్‌ తెలిపారు. వీఎం బంజర్‌ నుంచి చండ్రుగొండ మీదుగా కొత్తగూడెం వచ్చే వాహనాలు కల్లూరు, తల్లాడ, ఏన్కూరు, జూలూరుపాడు మీదుగా చేరుకోవాలని సూచించారు. అలాగే, కొత్తగూడెం నుంచి వీఎం బంజర వైపు వెళ్లే వారు కూడా ఇదే మార్గంలో ప్రయాణించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement