వైరారూరల్: మండలంలోని స్టేజీ పినపాక హైలెవల్ వంతెనపై సోమవారం ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని 15 మంది గాయపడ్డారు. వివరాలు ఇలా.. మణుగూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ సర్వీసు సుమారు 30 మంది ప్రయాణికులతో మణుగూరు నుంచి ఖమ్మం వస్తోంది. అదే సమయంలో లారీ వైరా వైపు నుంచి తల్లాడ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో స్టేజీ పినపాక హైలెవల్ వంతెనపై బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో రెండు వాహనాలు అతివేగంగా ఉండడంతో బస్సు డ్రైవర్ విజయ్ సహా బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యా యి. ఏసీపీ ఎం.ఏ.రెహమాన్, సీఐ ఎన్.సాగర్, ఎస్సై పి.రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని క్షత్రగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులకు మూడు గంటల సమయం పట్టింది.
పోలీసుల అదుపులో
అనుమానిత వ్యక్తి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ పోలీసులకు సమాచారం ఇచ్చా రు. దీంతో వారొచ్చి సదరు వ్యక్తిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా ఆస్పత్రిలో చిన్నారులను ఎత్తుకెళ్తుండగా ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు సోష ల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అది అవాస్తమని, అలాంటి వార్తలు నమ్మొద్దని సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు.
బంగారం చోరీ
అశ్వాపురం: మండల కేంద్రంలోని చిన్న తండాలో ఓ ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన తేజావత్ విజయ ఆదివారం సాయంత్రం ఇంటి సమీపంలో వినాయకచవితి ఉత్సవాల వద్దకు వెళ్లింది. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు గడ్డపలుగుతో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తాళాలు పగులగొట్టి 11 గ్రాముల బంగారం, రూ.20వేల నగదు చోరీచేశారు. సంఘటనా స్థలా న్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టారు.
సింగరేణి కార్మికుడికి పాముకాటు
మణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఏరియాలోని ఓసీ–2 డంపర్ షెడ్‌లో సోమవా రం మొదటి షిఫ్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న కమటం వెంకటేశ్వర్లుకు పాము కాటు వేసింది. దీంతో ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. కార్మికుడిని ఎస్‌ఓటూ జీఎం శ్రీనివాసచారి, ఏఐటీయూసీ నాయకులు మల్లెల రామనర్సయ్య, ఆదర్ల సురేందర్ తదితరులు పరామర్శించారు. కాగా అధికారులు ఇచ్చిన సమాచారంతో వచ్చిన స్నేక్ క్యాచర్ ముజాఫర్ పామును పట్టివేశాడు.
15 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ