
వాగులో మునిగి యువకుడి మృతి
చర్ల: మండలంలోని రాళ్లగూడేనికి చెందిన ఓ యువకుడు వాగులో మునిగి మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బండి భానుప్రకాశ్ (33) గోదావరి నది వైపు చేపల వేటకు వెళ్లే క్రమంలో మార్గమధ్యలోని ఊటొర్రె దాటు తూవాగులో మునిగిపోయాడు. సమీపంలో పశువులు మేపుతున్నవారు గమనించి పోలీస్, రెవెన్యూ, ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారులకు సమాచారం అందించారు. చర్ల సీఐ ఏ.రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్, తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాంకుమార్, భద్రాచలం నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు వాగులో వెతకగా మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య మార్తమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందరితో కలివిడిగా ఉండే భానుప్రకాశ్ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
డెంగీతో బాలిక మృతి
గుండాల: నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ బాలిక సోమవారం మృతి చెందింది. మండల కేంద్రానికి చెందిన ఇర్ప ప్రవలిక(15) హైదరాబాద్‌లో డిప్లొమా చదువుతోంది. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సఅందించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు డెంగీ జ్వరంగా గుర్తించారు. సోమవారం తెల్లవారు జామున పరిస్థితి విషమించి మృతి చెందింది.
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
టేకులపల్లి: చికిత్స పొందుతున్న వ్యక్తి సోమవారం మృతి చెందాడు. టేకులపల్లి పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తొమ్మిదోమైలుతండాకు చెందిన గుగులోతు పీక్లా (46 ) గత నెల 19న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

వాగులో మునిగి యువకుడి మృతి