
గోదావరిలో వినాయక నిమజ్జనం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరిలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం 167 గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. గణనాథుడికి ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు మేళతాళాలు, డప్పుచప్పులతో బాణసంచా కాల్చుతూ, ఊరేగింపుగా గోదావరి తీరంలో ఘాట్‌కు తరలించి నిమజ్జనం చేశారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు భక్తులను తీరం వరకు అనుమతించలేదు. స్నానఘట్టాల వద్ద స్నానాలు చేసేందుకు షవర్ ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాంచీలు, బోట్లలో వినాయక ప్రతిమలను తీసుకెళ్లి గోదావరి మధ్యలో గణనాథులను వదులుతున్నారు. ఘాట్ వద్ద విద్యుత్ సౌకర్యంతోపాటు నిత్యం పోలీసుల నిఘా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా నిమజ్జనం సందర్భంగా కొందరు సిబ్బంది భక్తుల నుంచి నగదు వసూళ్లు చేస్తుండటంతో శనివారం అర్ధరాత్రి గొడవ జరిగింది.