
‘సాదాబైనామా’పైనే ఆశలు
మార్గదర్శకాలు రాలేదు
బ్యాంకు రుణాలు రావట్లే..
క్రమబద్ధీకరణ అనుమతి హర్షణీయం
● ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న సాగుదారులు ● జిల్లాలో 62,511 మంది రైతుల దరఖాస్తులు
పాల్వంచరూరల్: క్రయవిక్రయాల ఒప్పందాలు తెల్లకాగితాల్లో రాసుకున్న రైతులు పట్టాల కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఇటీవల హైకోర్టు అనుమతులు ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సాదాబైనామాలపై దరఖాస్తులు స్వీకరించినా సమస్యను పరిష్కరించలేదు. భూములు సాగు చేసుకుంటున్నా ధరణి పోర్టల్ కారణంగా భూ యాజమాన్య హక్కు (పట్టా)లు రాలేదు. ఇందుకోసం ప్రస్తుత ప్రభుత్వం తీసుకురానున్న ఆర్‌ఓఆర్ బిల్లుపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.
పొజిషన్‌లో ఉన్నా..
భూముల క్రయవిక్రయాలు సాదా కాగితాలు, స్టాంప్ పేపర్లపైనా జరిగాయి. దశాబ్దాల నుంచి, తరతరాలుగా భూమిని సాగు చేసుకుంటున్నా, పొజిషన్‌లో ఉన్నా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదు. దీనికితోడు ఓ రైతు భూమి సర్వే నంబర్ మరో రైతు పట్టా పాసుపుస్తకంలో నమోదు కావడం, భూమిని విక్రయించినవారు చనిపోవడం, పూర్వీకులు విక్రయంచిన భూమినే వారి వారసులు మళ్లీ మరొకరికి విక్రయించడం వంటి సమస్యలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భూ యజమాన్య హక్కు(రిజిస్ట్రేషన్)లు నమోదు కాలేదు. దీంతో బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలేదు. రైతుభరోసాతో ఇతర సంక్షేమ పథకాలు కూడా అందడంలేదు. ఈ క్రమంలో గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూభారతి (ఆర్‌ఓఆర్–2024) చట్టం ద్వారా సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
2016 నుంచి 2020 వరకు స్వీకరణ
2014 జూన్ 2వ తేదీకి ముందు సాదాకాగితాలపై క్రయ విక్రయాలు జరుపుకున్న భూములను క్రమబద్ధీకరిస్తామని గత ప్రభుత్వం 2016లో దరఖాస్తులు స్వీకరించింది. 2020లో మరో విడుత దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఆ తర్వాత పట్టించుకోలేదు. జిల్లాలో మంది 62,511 సాదాబైనామా పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఏజెన్సీలో 1/70 యాక్ట్ ఉన్నా గిరిజన రైతులకుపట్టాలు లేవు. కేవలం గిరిజనుల మధ్యే క్రయవిక్రయాలు జరిగినా పట్టాలు లేవు. వారుకూడా భూ హక్కు పత్రాల కోసం నిరీక్షిస్తున్నారు.
సాదాబైనామాల క్రమబద్ధీకరణకు కోర్టు అనుమతులు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రాలేదు. గైడ్‌లైన్స్ వచ్చిన వెంటనే సాదాబైనామాల దరఖాస్తుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. 2014 కంటే ముందు క్రయవిక్రయాలు జరిగిన భూములపై నెలకొన్న సమస్యలకే పరిష్కారం లభిస్తుంది.
–వేణుగోపాల్‌రావు, జిల్లా అదనపు కలెక్టర్
నాకు సోములగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఐదెకరాల భూమి ఉంది. గతంలో ఆన్‌లైన్ పహాణీలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేస్తామంటే సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకున్నా. నేటికీ పట్టాపాసుపుస్తకాలు ఇవ్వలేదు. దీంతో బ్యాంక్ రుణాలు రావడంలేదు. ప్రభుత్వ సబ్సిడీలు అందడంలేదు.
–బండ్లపల్లి వెంకటనారాయణ, జగన్నాథపురం
సాదాబైనామాల సమస్య పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాం. కోర్టు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడం హర్షణీయం. గిరిజనుల నుంచి గిరిజనులు భూములను కొనుగోలు చేసినా పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంలేదు. సాదాబైనామా కింద 2014లో దరఖాస్తు చేసుకున్నా. ఇంత వరకు సమస్య పరిష్కారం కాలేదు.
–కొర్ర రాములు, సోములగూడెం

‘సాదాబైనామా’పైనే ఆశలు

‘సాదాబైనామా’పైనే ఆశలు