
బాలుడికి పాముకాటు..
అశ్వారావుపేటరూరల్: ఆటాడుకుంటున్న ఓ బాలుడు పాముకాటుకు గురి కాగా, ఓ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్తే విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలంలోని బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీ పరిధి కొత్త వాగొడ్డుగూడెం గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు మడకం బాబీ ఆదివారం ఉదయం ఇంటి సమీపాన తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈక్రమంలో పాముకాటుకు గురికాగా.. తల్లిదండ్రులు హుటాహుటిన సమీపంలోని గుమ్మడవల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈసమయాన ఆస్పత్రిలో విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది బాలుడిని పట్టించుకోకుండా.. కనీసం ప్రథమ చికిత్స కూడా చేయకుండా వైద్యులు, మందులు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారని బాధిత కుటుంబీకులు వాపోయారు. బాలుడిని అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, వైద్యాధికారులు విధుల్లో లేకపోవడంతో పాటు సిబ్బంది కనీసం పట్టించుకోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. దీనిపై గుమ్మడవల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి వెంకటేశ్వరరావు వివరణ కోసం ‘సాక్షి’ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.
పోలీసుల అదుపులో దొంగల ముఠా
దమ్మపేట: దొంగిలించిన బంగారు నగలను విక్రయించడానికి వెళ్తున్న ఓ ముఠాను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. దమ్మపేట ఎస్సై సాయికిషోర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఇటీవల మండలంలోని బాలరాజుగూడెం గ్రామంలో ఓ ఇంటిలో బంగారు నగలను చోరీ చేసిన కొమ్మనబోయిన సీతారాములు ఆ నగలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, కల్లూరుకు చెందిన నలుగురు వ్యక్తులకు (ముగ్గురు పురుషులు, ఒక మహిళ) విక్రయించమని ఇచ్చాడు. దీంతో ఆ నలుగురు ఆటోలో సత్తుపల్లి నుంచి ఏపీ, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు బయలుదేరారు. ఈ క్రమంలో వారు మండలంలోని మొద్దులగూడెం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసుల వద్ద తారసపడ్డారు. ఆటోలో ఉన్న ఈ నలుగురి ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో వా రిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారించారు. వారి వద్ద ఉన్న 92 గ్రాముల బంగారు ఆభరణాలు(నల్లపూసల గొలుసు, నెక్లెస్, సాదా గొలుసు), మొబైల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు సీతారాములు పరారీలో ఉండగా.. ఈ నలుగురిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపామని ఎస్సై తెలిపారు.
మధిర పట్టణంలో చోరీ
మధిర: పట్టణంలోని నందిగామ బైపాస్ రోడ్డు సమీపంలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చెరుకూరి నాగార్జున శనివారం హైదరాబాద్ వెళ్లగా ఆయన సతీమణి లక్ష్మి ఎన్టీఆర్‌జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలోని పుట్టింటికి వెళ్లింది. గుర్తుతెలియని దుండగులు అదే రోజు రాత్రి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.1.20 లక్షల నగదు, 4 బంగారు గాజులు, నల్లపూసల గొలుసు చోరీచేశారని, సుమారు రూ.9లక్షల సొత్తును అపహరించినట్లు బాధితుడు తెలిపారు. మరో గది తలుపు గడియ పగలగొట్టి దుస్తులు, వస్తువులను చిందరవందర చేశారు. ఘటనా స్థలాన్ని టౌన్ ఎస్‌హెచ్‌ఓ రమేశ్‌తో పాటు ఖమ్మం నుంచి క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

బాలుడికి పాముకాటు..