
స్థానిక పోరుకు సిద్ధం!
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ పోరులో క్షేత్రస్థాయిలో తమ బలం పెంచుకునేలా వ్యూహాలను రచిస్తున్నాయి. ఇప్పటికే సీపీఐ ఆ దిశగా కసరత్తు చేస్తుండగా తాజాగా బీజేపీ సైతం కార్యకర్తల్లో జోష్ నింపింది.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
ఎన్నికలకు సమాయత్తమవుతున్న రాజకీయ పార్టీలు
● కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించాలంటూ సీపీఐ డిమాండ్
● క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే పనిలో భారతీయ జనతా పార్టీ
● ఏ క్షణమైనా ఎన్నికలకు సిద్ధమేనంటున్న కాంగ్రెస్ శ్రేణులు
క్షేత్రస్థాయిలో బలపడాలనే యోచనలో బీజేపీ
వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఈసారైనా క్షేత్రస్థాయిలో బలపడాలని భారతీయ జనతా పార్టీ ఆలోచనలో ఉంది. ఇప్పటికీ ఆ పార్టీ పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మండల, గ్రామ స్థాయిలో పార్టీని విస్తరించేందుకు మంచి అవకాశంగా చూస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అంటే కాంగ్రెస్, వామపక్షాలు, ఒకప్పుడు టీడీపీ అన్నట్టుగా ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు, బీఆర్‌ఎస్‌లు బలమైన పార్టీలుగా ఉండగా, ఆ స్థాయిలో బీజేపీకి బలం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామస్థాయిలో సర్పంచ్, వార్డు మెంబర్లుగా బీజేపీ తరఫున నిలబడేందుకు ఆసక్తి చూపిస్తున్న ఆశావహుల సంఖ్య పెరిగింది. ఇలాంటి వారిని గుర్తించి అధిక స్థానాల్లో విజయం సాఽధించడం ఎలా అన్న అంశంపై ఆ పార్టీ అగ్రనాయకత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాకు కొత్త అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చేతికి పగ్గాలు అప్పగించింది. ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న రామచంద్రరావు సైతం రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించి ఆ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపారు.
గుంభనంగా కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి చేదు ఫలితాలు ఎదురైనా ఈ జిల్లాలో అంచనాలకు మించి సానుకూల ఫలితాలు సాధించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని ఎదుర్కోవడం ఆ పార్టీ సిద్ధంగా ఉంది. అయితే ఎప్పటిలాగే ఆ పార్టీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండటం, అందులో నుంచి అభ్యర్థులను ఎంపిక చేయడమే సమస్యగా మారనుంది. పైగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో కాంగ్రెస్‌లో చేరికలు జరిగాయి. దీంతో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం మరో సవాల్‌గా ఆ పార్టీ ముందు నిలిచింది. దీంతో ముందే ఎన్నికల హడావుడి చేస్తే ఎదురయ్యే అంతర్గత సమస్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గుంభనంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం తడాఖా చూపిస్తామని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.
కాంగ్రెస్ వైఫల్యాలు లాభిస్తాయని
బీఆర్‌ఎస్ అంచనా..
ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి సైతం ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యాలు తమకు లాభిస్తాయని ఆ పార్టీ అంచనాతో ఉంది. దీనికితోడు పార్టీ ఫిరాయింపుల కేసులో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో భద్రాచలం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయనే అంచనాతో ఆ పార్టీలో వేడిని పెంచాయి.
మిత్రధర్మం పాటించాలి...
2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. ఈ క్రమంలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్న కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ప్రభుత్వానికి మిత్ర పక్షంగా ఉండటంతో పాటు వామపక్ష పార్టీల గొంతు అసెంబ్లీ వినిపించే అవకాశం సీపీఐకి వచ్చింది. ఈ రెండు కలిసి వచ్చి మరోసారి జిల్లాలో సీపీఐ తన బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మిత్రధర్మం పాటిస్తూ తమకు బలం ఉన్న చోట ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వాలని అధికార కాంగ్రెస్ ముందు డిమాండ్ పెట్టింది. జిల్లాలో అనేక గ్రామాల్లో తమకు పట్టుందని పేర్కొంటోంది. గత ఎన్నికల్లో గెలుపు సాధించామని గుర్తు చేస్తోంది. ఇవే విషయాలను ఇటీవల జరిగిన సీపీఐ సంస్థాగత సమావేశాల్లో కూనంనేని, జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో తమకు న్యాయం జరగకపోతే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారు.