పల్లె సమస్యలపై స్పందన
చుంచుపల్లి: కొంతకాలంగా ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలపై గురువారం సాక్షిలో ప్రచురితమైన ‘పల్లెలో ప్రత్యేక పాట్లు’కథనానికి అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. పారిశుద్ధ్యంతో పాటు ఇతర సమస్యలపై దృష్టి సారించారు. ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని గ్రామాల్లో సమస్యలపై ఆరా తీస్తున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనను సంప్రదించగా ప్రత్యేక అధికారులకు పాలనపై మరింత దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.
వివాహిత అదృశ్యం
పాల్వంచరూరల్: దంపతుల మధ్య గొడవ జరగగా మనస్తాపం చెందిన భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన ధర్మసోత్ గోప భార్య సుజాత భర్తతో గొడవపడి గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ లభించకపోవడంతో సుజాత తండ్రి మాళోతు మగితియా ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేశ్ కేసు నమోదు చేశారు.


