మంగళగిరి టౌన్: రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టడంతోపాటు యువతను డ్రగ్స్ బారి నుంచి రక్షించేందుకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఈగల్ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు ఈగల్ చీఫ్ ఐజీ ఆకే రవికృష్ణ, డీసీఏ డైరెక్టర్ జనరల్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఎక్స్ మందులు, ఓపియాయిడ్స్ దుర్వినియోగాన్ని అరికట్టడం, ఔషధాల అక్రమ సరఫరాపై నిఘా పెంచడం, సమాచార మార్పిడి, సంయుక్త తనిఖీలను విస్తృతం చేయడంపై దృష్టి సారించామని తెలిపారు. గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను నిరోధించేందుకు ఆపరేషన్ గరుడ వంటి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
నేలబావిలో గుర్తుతెలియని మృతదేహం
తాడేపల్లి రూరల్: కృష్ణా కెనాల్–తాడేపల్లి ప్రధాన రహదారి మధ్యలో ఉన్న ఓ నేలబావిలో మృతదేహం కలకలం రేపింది. మంగళవారం బావిలో మృతదేహం ఉన్నట్లు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందింది. తొలుత ఘటన తమ పరిధిలోకి రాదని, రైల్వే పోలీసుల పరిధికి వస్తుందని చెప్పడంతో మృతదేహాన్ని బయటకు తీసే ప్రక్రియలో జాప్యం జరిగినట్లు తెలిసింది. చివరకు సాయంత్రం తాడేపల్లి పోలీసులే బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. మృతుడు బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహం లభించిన నేలబావి రైల్వేస్టేషన్‌కు సుమారు 150 అడుగుల దూరంలో ఉన్నట్లు తెలిసింది. మృతికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణకు రాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంలో కార్మికుడు మృతి
తెనాలిటౌన్: విద్యుదాఘాతంలో ఎలక్ట్రికల్ వర్కర్ మృతి చెందిన ఘటన మంగళవారం పట్టణంలో చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా నగరం మండలం సజ్జవారిపాలెం అగ్రహారానికి చెందిన అమర్తలూరి అక్షయ్ బాబు(30) తెనాలి పట్టణంలో ఓ కాంట్రాక్టర్ వద్ద విద్యుత్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. స్థానిక నందులపేట వినాయకుని గుడి రోడ్డులో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు రవీంద్ర అనే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పనిచేస్తుండగా స్తంభంపై ఉన్న అక్షయబాబు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. ఇన్వర్టర్ రిటర్న్ సప్లయి కారణంతో అక్షయ మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని ఏపీ సీపీడీసీఎల్ తెనాలి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అక్కల సత్యనారాయణ, టౌన్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బోరుగడ్డ అశోక్‌కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నట్టు బంధువులు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని విద్యుత్ అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నందులపేట ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.


